Indore: ర్యాగింగ్ కేసులో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు

ABN , First Publish Date - 2022-07-27T01:08:22+05:30 IST

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌ (Indore)లో ఉన్న మహాత్మా గాంధీ వైద్య కళాశాల

Indore: ర్యాగింగ్ కేసులో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు

ఇండోర్ : మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌ (Indore)లో ఉన్న మహాత్మా గాంధీ వైద్య కళాశాల (Mahatma Gandhi Medical College)లో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. అసభ్యకరంగా ప్రవర్తించాలని మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సీనియర్ స్టూడెంట్స్ వేధిస్తున్నట్లు కేసు నమోదైంది. దాడి చేసి, ర్యాగింగ్‌కు పాల్పడినందుకు ఎనిమిది మంది గుర్తు తెలియని సీనియర్ స్టూడెంట్స్‌ను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. 


ఎంజీఎం కళాశాల డీన్ డాక్టర్ సంజయ్ దీక్షిత్ మాట్లాడుతూ, బాధితులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు చెందిన యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆ ఫిర్యాదును తమకు పంపించారని తెలిపారు. ఈ ఫిర్యాదును బలపరచే సాక్ష్యాధారాలు ఉన్నాయని యాంటీ ర్యాగింగ్ కమిటీ సంతృప్తి చెందినట్లు తెలిపారు. జూనియర్ స్టూడెంట్స్‌ను వేధిస్తున్నట్లు రుజువు చేసే ఆడియో రికార్డింగ్స్, ఇతర సాక్ష్యాధారాలు ఉన్నాయని సంతృప్తి చెందినట్లు చెప్పారు. ఈ ఫిర్యాదును గుర్తు తెలియని విద్యార్థులు దాఖలు చేశారని చెప్పారు. అయితే సాక్ష్యాధారాలు నిజమైనవేనని నిర్థరణ అయిందన్నారు. 


దీంతో ఎంజీఎం మెడికల్ కాలేజ్ యాంటీ ర్యాగింగ్ కమిటీ సంయోగిత గంజ్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. సీనియర్ మెడికల్ స్టూడెంట్స్ జూనియర్లకు ఫోన్ చేసి క్లాస్‌మేట్స్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాలని వేధించేవారని ఈ ఫిర్యాదులో ఆరోపించారు. విద్యార్థినులపై అశ్లీల వ్యాఖ్యలు చేయాలని బెదిరించేవారని పేర్కొన్నారు. ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవాలని, గుంజీలు తీయాలని  డిమాండ్ చేసేవారని, మానసికంగా వేధించేవారని ఆరోపించారు. 


పోలీసు అధికారి తెహజీబ్ కాజీ మాట్లాడుతూ, ఈ ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 


Updated Date - 2022-07-27T01:08:22+05:30 IST