Mayor: నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2022-09-30T13:23:37+05:30 IST

రాజధాని నగరంలో నిబంధనలు అతిక్రమించిన 3.10 లక్షల భవనాలను పరిశీలించి, చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ)

Mayor: నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఉక్కుపాదం

                           - జీసీసీ సమావేశంలో మేయర్‌ ప్రియ


ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 29: రాజధాని నగరంలో నిబంధనలు అతిక్రమించిన 3.10 లక్షల భవనాలను పరిశీలించి, చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) మేయర్‌ ప్రియ ప్రకటించారు. జీసీసీ కౌన్సిల్‌ సమావేశం గురువారం ఉదయం మేయర్‌ ఆర్‌. ప్రియ(Mayor R. Priya) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, పుదుమై పెన్‌గళ్‌ పథకాలను అమలుపరచిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభినందిస్తూ మేయర్‌ ప్రియ ప్రసంగించారు. జీసీసీ పరిధిలోని 200 వార్డుల్లో పారిశుధ్యంపైౖ ప్రత్యేక దృష్టి సారించామని, సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా ప్రారంభ దశలోనే అడ్డుకొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న 107 కాంట్రాక్ట్‌ వైద్యులకు మరో 11 నెలల వరకు ఉద్యోగంలో కొనసాగడంపై కౌన్సిల్‌ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. నుంగంబాక్కంలోని కార్పొరేషన్‌ మహోన్నత పాఠశాల మోడల్‌ పాఠశాలగా ఎంపికైందని, ఈ పాఠశాల స్థాయి పెంచి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు మంచినీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్‌ తదితర కనీసవసతులను సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. అడయార్‌ గాంధీ నగర్‌ పార్క్‌కు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi) పేరు పెట్టాలని జీసీసీ సమావేశం నిర్ణయించిందన్నారు. ఈ సమావేశంలో మొత్తం 97 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. ప్రధానంగా సీఎండీఏ, జీసీసీ టౌన్‌ ప్లానింగ్‌ సంస్థల నుంచి అనుమతి పొందిన తర్వాతే భవన నిర్మాణాలను చేపట్టాలని, అలా కాకుండా నిబంధనలు అతిక్రమించినట్లు సర్వేలో వెల్లడైన 3.10 లక్షల భవనాలకు నోటీసులిచ్చి విచారణ జరపాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. ఆరు నెలలకు ఒకసారి ఆస్తి పన్ను చెల్లించని వారికి అదనంగా విధించే 2 శాతం వడ్డీని ఈ ఏడాది మాఫీ చేయనున్నట్లు మేయర్‌ ప్రియ ప్రకటించారు. ఈ సమావేశంలో జీసీసీ కమిషనర్‌ గగన్‌దీ్‌పసింగ్‌ బేదీ, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్లు, జోనల్‌ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-30T13:23:37+05:30 IST