మాయావతి పొత్తుకు ఒప్పుకోలేదు

ABN , First Publish Date - 2022-04-10T08:14:41+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటామని తాము ప్రతిపాదించినా మాయావతి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు.

మాయావతి పొత్తుకు ఒప్పుకోలేదు

సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించినా స్పందించలేదు: రాహుల్‌గాంధీ

కె. రాజు పుస్తకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్‌ నేత


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటామని తాము ప్రతిపాదించినా మాయావతి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. బహుశా ఆమెపై కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఒత్తిడి ఉండి ఉంటుందని ఆయన చెప్పారు. అదేవిధంగా ఇతర రాజకీయ నాయకుల్లా తనకు అధికారంపై ఎలాంటి ఆసక్తిలేదని స్పష్టంచేశారు. మాజీ ఐఏఎస్‌ అధికారి కె.రాజు సంపాదకత్వంలో శనివారం విడుదలైన ‘‘ద దళిత్‌ ట్రూత్‌-బ్యాటిల్స్‌ ఫర్‌ రియలైజింగ్‌ అంబేద్కర్స్‌ విజన్‌’’  పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఈ  ఎన్నికల్లో అసలు మాయావతి  పోరాడలేదని ఆయన చెప్పారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ పట్ల తనకె ంతో గౌరవం ఉందని, యూపీలో దళిత స్వరం చైతన్యవంతంగా వినిపించేందుకు ఆయన జీవితాన్ని ధారపోశారని అన్నారు. దీనివల్ల  అప్పట్లో కాంగ్రె్‌సకు నష్టం క లిగిన మాటనిజమేనని రాహుల్‌ అంగీకరించారు. కాగా, తాను అధికారంలో పుట్టినా.. అధికారం అంటే తనకు ఆసక్తి లేదన్నారు. ప్రతి రోజూ తాను దేశం గురించి ఆలోచించే  నిద్రిస్తానని రాహుల్‌ చెప్పారు. మరోవైపు, 2016లో ఉనాలో దళితుల ఊచకోత ఘటన వివరాలను కూడా రాహుల్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ సంఘటన తర్వాత ఎందరో దళితులు ఆత్మహత్యకు ప్రయత్నించారని ఒక దళిత యువకుడి తండ్రి తనకు చెప్పాడని రాహుల్‌ తెలిపారు. ఒక ముస్లిం బాలుడిని కొట్టడం తనకు సంతోషకరమని వీరసావర్కార్‌ అన్నట్లు ఒక పుస్తకంలో చదివానని రాహుల్‌ గుర్తుచేశారు. కాగా, మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు కాకుండా అడ్డుపడుతోందని, రాజకీయ నాయకులను నియంత్రించేందుకు పెగాసస్‌ను ఉపయోగించుకుంటోందని రాహుల్‌ ఆరోపించారు. రాజకీయ వ్యవస్థను పెగాసస్‌, సీబీఐ, ఈడీ  నియంత్రిస్తున్నాయని అన్నారు.  

Updated Date - 2022-04-10T08:14:41+05:30 IST