Canada Temple Vandalism : కెనడాలో స్వామినారాయణ్ దేవాలయంపై దాడి... కఠిన చర్యలకు బీజేపీ నేత డిమాండ్...

ABN , First Publish Date - 2022-09-15T23:31:47+05:30 IST

కెనడాలోని టొరంటో (Toronto)లో ఉన్న బీఏపీఎస్ స్వామినారాయణ్

Canada Temple Vandalism : కెనడాలో స్వామినారాయణ్ దేవాలయంపై దాడి... కఠిన చర్యలకు బీజేపీ నేత డిమాండ్...

న్యూఢిల్లీ : కెనడాలోని టొరంటో (Toronto)లో ఉన్న బీఏపీఎస్ స్వామినారాయణ్ దేవాలయాన్ని కొందరు దుండగులు అపవిత్రం చేయడాన్ని బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా గురువారం ఖండించారు. ఈ సంఘటన తీవ్రంగా కలచివేసిందని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్వేషాన్ని వ్యాపింపజేయడం కోసమే ఇటువంటి దురాగతానికి పాల్పడ్డారని ఆరోపించారు. 


బీఏపీఎస్ స్వామినారాయణ్ (BAPS Swaminarayan) దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం దాడి చేశారు. దేవాలయం గోడలపై భారత దేశ వ్యతిరేక నినాదాలను రాశారు. ఈ సంఘటనను భారత హై కమిషన్ (Indian High Commission) ఖండించింది. ఈ విషయాన్ని కెనడా (Canada) ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మందిరాన్ని అపవిత్రం చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఓ ట్వీట్‌లో తెలిపింది. దోషులపై తగిన చర్య తీసుకోవాలని కెనడా ప్రభుత్వాధికారులను కోరినట్లు తెలిపింది. 


ఇదిలావుండగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఈ దేవాలయం గోడలపై రాసిన భారత వ్యతిరేక, ఖలిస్థాన్ అనుకూల నినాదాలు కనిపిస్తున్నాయి. దీనిపై బ్రంప్టన్ సౌత్ ఎంపీ సోనియా సిద్ధూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మనం బహుళ సంస్కృతుల, బహుళ మతాల సమాజంలో జీవిస్తున్నాం. సురక్షితంగా ఉన్నామనే భావన కలిగియుండటానికి ప్రతి ఒక్కరూ అర్హులే. బాధ్యులైనవారిని గుర్తించి, వారి చర్యలకు పర్యవసానాలను ఎదుర్కొనేలా చేయాలి’’ అని పేర్కొన్నారు. 


ఈ నేపథ్యంలో మంజిందర్ సింగ్ సిర్సా (Manjinder Singh Sirsa) ఓ వార్తా సంస్థతో గురువారం మాట్లాడుతూ, తాను ఈ సంఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. విద్వేషాన్ని వ్యాపింపజేయడమే దీని లక్ష్యమని తెలిపారు. పాకిస్థాన్ ఈ పనులను నిరంతరం కొనసాగిస్తోందన్నారు. ఇటువంటి విషయాల్లో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. కెనడా మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. ఈ సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు. 


Updated Date - 2022-09-15T23:31:47+05:30 IST