BJP Vs AAP : ‘ఆపరేషన్ లోటస్’ కోసం సీబీఐ, ఈడీ కృషి : మనీశ్ సిసోడియా

ABN , First Publish Date - 2022-09-21T22:39:53+05:30 IST

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ తరపున కేంద్ర దర్యాప్తు

BJP Vs AAP : ‘ఆపరేషన్ లోటస్’ కోసం సీబీఐ, ఈడీ కృషి : మనీశ్ సిసోడియా

న్యూఢిల్లీ : ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ తరపున కేంద్ర దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఆరోపించారు. ‘ఆపరేషన్ లోటస్’ కోసం సీబీఐ (Central Bureau of Investigation), ఈడీ (Enforcement Directorate) కృషి చేస్తున్నాయన్నారు. 


రాజకీయ నేతలపై ఈడీ కేసులు పెరుగుతున్న వైనాన్ని వివరిస్తూ ఓ వార్తా పత్రిక ప్రచురించిన కథనాన్ని మనీశ్ సిసోడియా ప్రస్తావించారు. 2014లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా బీజేపీయేతర పార్టీల నేతలపై ఈడీ కేసులు పెరుగుతున్నాయని ఈ కథనంలో పేర్కొన్నారని చెప్పారు. ఆయన బుధవారం ఇచ్చిన ట్వీట్‌కు ఈ కథనాన్ని జత చేశారు. 


‘‘ఈ రోజుల్లో సీబీఐ, ఈడీ ‘ఆపరేషన్ లోటస్’ను అమలు చేయడం కోసమే పని చేస్తున్నాయి. 95 శాతం కేసుల్లో ఈ సంస్థలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడానికి సాధనంగా మారాయి. ఇలా అయితే దేశం ఏ విధంగా ప్రగతి సాధిస్తుంది?’’ అని మనీశ్ సిసోడియా ప్రశ్నించారు. 


ఈ పత్రిక ప్రచురించిన కథనంపై మనీశ్ సిసోడియా (Manish Sisodia)తోపాటు ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా స్పందించారు. బీజేపీ ఆపరేషన్ లోటస్‌ (Operation Lotus)ను అమలు చేసే సాధనంగా సీబీఐ, ఈడీ మారిపోయాయని ఆరోపించారు. గ్రేటర్ కైలాష్ ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bhardwaj) ఇచ్చిన ట్వీట్‌లో, ఈడీని రాజకీయ సాధనంగా కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. టార్గెట్ అయిన రాజకీయ నేతల్లో 95 శాతం మంది ప్రతిపక్షాలకు చెందినవారేనని ఈ కథనం పేర్కొందని చెప్పారు. బీజేపీలో చేరినవారికి ఈడీ నుంచి ఉపశమనం దొరుకుతుందన్నారు. 


ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Policy) కుంభకోణంలో దాదాపు 15 మంది నిందితులు ఉన్నారు. వీరిలో మనీశ్ సిసోడియా ఒకరు. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా (Vinai Saxena) ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసులో దర్యాప్తు జరుపుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ తెలంగాణా సహా వివిధ రాష్ట్రాల్లో సోదాలు జరుపుతోంది. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, నెల్లూరు, నోయిడా, గురుగ్రామ్, ముంబై, చండీగఢ్, జలంధర్, హైదరాబాద్‌లలో పలు చోట్ల సోదాలు జరుపుతోంది. 


Updated Date - 2022-09-21T22:39:53+05:30 IST