2024లో ఆట బెంగాల్‌ నుంచే మొదలు!

ABN , First Publish Date - 2022-09-10T08:29:37+05:30 IST

కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమయ్యే విషయంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2024లో ఆట బెంగాల్‌ నుంచే మొదలు!

ప్రతిపక్ష నేతలమంతా ఏకమవుతాం: మమత

కోల్‌కతా, సెప్టెంబరు 9: కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమయ్యే విషయంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని గద్దె దించేందుకు బిహార్‌, ఝార్ఖండ్‌ సీఎంలు నితీశ్‌కుమార్‌, హేమంత్‌ సోరెన్‌, ఎస్పీ నేత అఖిలేశ్‌, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌ సహా ఇతర నేతలంతా తమతో కలిసి వస్తారని అన్నారు. 2024లో ఆట బెంగాల్‌ నుంచే మొదలవుతుందని వ్యాఖ్యానించారు. అయితే నితీశ్‌కుమార్‌ ఇప్పటికే ప్రతిపక్షాల ఐక్యత కోసం వివిధ పార్టీల నేతలను కలుస్తుండడం, మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా అదే పనిలో ఉన్న నేపథ్యంలో మమత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యల ద్వారా ప్రతిపక్ష పార్టీల కూటమికి తాను నాయకత్వం వహించాలని కోరుకుంటున్నట్లుగా ఆమె సంకేతాలు ఇచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇక ఢిల్లీలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనను పిలిచిన తీరును మమత తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ప్రధాని మోదీ సాయంత్రం నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మీరు హాజ రు కావాలి అంటూ జూనియర్‌ స్థాయి అధికారి ఒకరు నాకు లేఖ పంపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి జూనియర్‌ స్థాయి అధికారి లేఖ పంపడమేంటి? నేనేమైనా వారి సేవకురాలినా?’’ అని మమత మండిపడ్డారు. నేతాజీ పట్ల గౌరవాన్ని చాటుకునేందుకు ఆ తరువాత వచ్చి దండ వేశానని చెప్పారు. 

Read more