Congress Presidential Polls: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే నామినేషన్ దాఖలు

ABN , First Publish Date - 2022-09-30T20:12:16+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల కోసం

Congress Presidential Polls: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే నామినేషన్ దాఖలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల కోసం మల్లికార్జున ఖర్గే నామినేషన్ పత్రాలను శుక్రవారం దాఖలు చేశారు. దీంతో ఈ ఎన్నికల బరిలో ఆయనతోపాటు శశి థరూర్ తలపడుతున్నారు. వచ్చే నెల 17న ఈ ఎన్నికలు జరుగుతాయి. ఖర్గేకు పార్టీ అధిష్ఠాన వర్గం ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో పలువురు సీనియర్ నేతలు ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. 


నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయంలో చిట్ట చివరి క్షణంలో మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వం తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరచింది. నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ రోజుకు 16 నుంచి 18 గంటలపాటు పని చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌కు నూతన జవసత్వాలను అందించడంలో ఎనభయ్యేళ్ళ ఖర్గే ఏ మేరకు విజయవంతమవుతారో చూడాలని విశ్లేషకులు అంటున్నారు. 


2020లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో చాలా మంది మల్లికార్జున ఖర్గేకు మద్దతు ప్రకటించారు. ఆ లేఖపై తమతోపాటు సంతకం చేసి, ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచిన శశి థరూర్‌కు ‘చెయ్యి’చ్చారు. 


ఖర్గే ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు లోక్‌సభ సభ్యునిగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. గతంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు. ఆయనకు వయసు రీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే మధుమేహం, గుండె సంబంధిత రుగ్మతలు లేవు. మోకాలి చిప్పను మార్చడంతో నడవాలంటే ఎవరో ఒకరి సహాయం అవసరమవుతుంది. 


Updated Date - 2022-09-30T20:12:16+05:30 IST