Congress President polls: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త మెలిక... నామినేషన్ వేయబోతున్న ఎవరూ ఊహించని నేత...

ABN , First Publish Date - 2022-09-30T16:49:59+05:30 IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల బరిలోకి

Congress President polls: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త మెలిక... నామినేషన్ వేయబోతున్న ఎవరూ ఊహించని నేత...

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల బరిలోకి కొత్త నేత ప్రవేశించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh), కేరళ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) తర్వాత ఇప్పుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) రంగంలోకి దిగారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలపై శశి థరూర్ స్పందిస్తూ, ఎంత ఎక్కువ మంది పోటీ చేస్తే పార్టీకి అంత మంచిదని వ్యాఖ్యానించారు. నామినేషన్ల దాఖలుకు తుది గడువు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. 


ఖర్గే రంగంలోకి దిగడంతో దిగ్విజయ్ సింగ్ నామినేషన్ దాఖలు చేయకపోవచ్చునని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో శశి థరూర్, ఖర్గే మధ్య పోటీ ఉండబోతోందని తెలుస్తోంది. 


నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి బయల్దేరే ముందు శశి థరూర్ మీడియాతో మాట్లాడుతూ, తాను పట్టుదలతోనే పోటీ చేస్తున్నానని చెప్పారు. ఈ విషయాన్ని తాను ఎల్లప్పుడూ చెప్తూనే ఉన్నానని చెప్పారు. ఖర్గే, దిగ్విజయ్ పోటీ గురించి ప్రస్తావిస్తూ, తమ సిద్ధాంతం, భావజాలం ఒకటేనని చెప్పారు. పార్టీని బలోపేతం చేయాలన్నదే ఆ సిద్ధాంతమన్నారు. తమ మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని, శత్రుత్వం కాదని చెప్పారు. ఖర్గే చాలా గౌరవనీయుడైన సహచరుడని, ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది పోటీ చేయడం శుభపరిణామమని తెలిపారు. రాజ్‌ఘాట్‌ను సందర్శించి, మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. బరిలో దిగినపుడు ఫలితం అనిశ్చితంగా ఉంటుందని అందరికీ తెలుసునని చెప్పారు. నా ప్రయత్నం నేను సజావుగా చేయగలననే నమ్మకంతో పోటీ పడాలని తెలిపారు.


దిగ్విజయ్ సింగ్ అంతకుముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్ళారు. ఇరువురు నేతలు చాలా సేపు మంతనాలు జరిపారు. రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ తివారీ మాట్లాడుతూ, దళిత నేతకు తాను మద్దతిస్తానని తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభ గురించి తెలిసినవారికి తాను మద్దతిస్తానన్నారు. 

Updated Date - 2022-09-30T16:49:59+05:30 IST