Mahua Moitra: మోదీకి శుభాకాంక్షలు చెబుతూనే చురకలు..!

ABN , First Publish Date - 2022-09-17T22:18:48+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శకులలో ఒకరిగా తరచు వార్తల్లో ఉంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ ..

Mahua Moitra: మోదీకి శుభాకాంక్షలు చెబుతూనే చురకలు..!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విమర్శకులలో ఒకరిగా తరచు వార్తల్లో ఉంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ మహువ మొయిత్రా (Mahua Moitra) శనివారంనాడు ఆయనకు ఒక ట్వీట్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday wishes) తెలిపారు. ఇదే సమయంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వేగంగా అంతరించిపోతున్న రాజ్యాంగ రక్షణను ప్రస్తావించారు. ''గౌరవనీయులైన ప్రధానమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అంతరించి పోతున్న చిరుతపులుల విషయంలో ఏమి చేశారో అదే విధంగా అంతరించిపోతున్న రాజ్యాంగ విలువలను కూడా పునరుద్ధరించాలి'' అంటూ ట్వీట్ చేశారు.


ఎంతో చేశారంటూ... కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు

కాగా, కాంగ్రెస్ పార్టీ సైతం అధికార ట్విట్టర్ ఖాతాలో మోదికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూనే వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ''ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు మీకు చిరాయువు ప్రసాదించాలి. ఈ దేశ యువతకు మీరు చాలా చేశారు. ఈరోజు జాతీయ నిరుద్యోగ దినోత్సవం జరుపుకోవడానికి ఇదో కారణం. ఈ దేశంలోని ప్రతి నిరుద్యోగి మీకు రుణపడి ఉంటారు'' అని భారత జాతీయ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 


పార్టీలకు అతీతంగా ప్రధానికి పుట్టినరోజు శుక్షాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిథరూర్, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ముఖమంత్రి కె.చంద్రశేఖరరావు తదితరులు ఉన్నారు.

Read more