Sena Vs Sena: అసెంబ్లీ వెలుపల హైడ్రామా.. శివసేన వర్గాల తోపులాట

ABN , First Publish Date - 2022-08-24T23:42:33+05:30 IST

శివసేన ఉద్ధవ్ వర్గం, ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు బుధవారంనాడు అసెంబ్లీ వెలుపల ఒకరిపై ఒకరు విమర్శలు..

Sena Vs Sena: అసెంబ్లీ వెలుపల హైడ్రామా.. శివసేన వర్గాల తోపులాట

ముంబై: శివసేన ఉద్ధవ్ వర్గం, ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు బుధవారంనాడు అసెంబ్లీ వెలుపల ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు గుప్పించుకున్నారు. నినాదాలు, ప్రతినినాదాల మధ్య తోపులాటలు కూడా చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ఐదోరోజు విధాన్ భవన్ వద్ద అధికార కూటమి ఎమ్మెల్యేలు ఎవరూ ఊహించని రీతిలో నిరసనకు దిగారు. సహజంగా విపక్ష నేతలు అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు విధాన్ భవన్ మెట్ల వద్ద నిరసన తెలపడం రివాజు. కానీ, ఇందుకు భిన్నంగా అధికార కూటమి (Ruling alliance) ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.


మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న తప్పిదాలు, అవినీతిని తప్పుపడుతూ అధికార కూటమి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. జైలుకు వెళ్లిన అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌ల అవినీతిని నిలదీశారు. దీంతో విపక్ష (థాకరే వర్గం) ఎమ్మెల్యేలు అక్కడకు చేరుకుని ప్రతినినాదాలు చేశారు. డబ్బులు తీసుకుని బీజేపీ క్యాంపులోకి చేరడాన్ని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. ఎన్‌సీపీ ఎమ్మెల్యే అనిల్ పాటిల్ తన చేతిలో క్యారెట్లు పట్టుకుని ఊపుతూ, రైతుల విషయంలో కొత్త ప్రభుత్వ విధానాలను నిలదీశారు. తప్పుడు వాగ్దానాలతో రైతులను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ప్రతిగా ఏక్‌నాథ్ వర్గం ఎమ్మెల్యేలు భరత్ గోగవాలే, ప్రతాప్ సర్నాయక్‌లు విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఎన్సీపీ ఎణ్మెల్యేలు రోహిత్ పవార్, అమోల్ మిట్కారి కూడా అక్కడకు చేరడంతో ఎమ్మెల్యేల తోపులాట చోటుచేసుకుంది. 


అవినీతిపైనే నిరసన తెలిపాం..

కాగా, తాము ఎంవీఏ గత ప్రభుత్వ అవినీతికి నిరసనగానే మహారాష్ట్ర అసెంబ్లీ మెట్లపై నిరసన తెలిపామని షిండే వర్గం నేత, అసెంబ్లీ చీఫ్ విప్ భరత్ గోగవాలే మీడియాకు తెలిపారు. తాము నిరసన చేస్తుండగా, విపక్ష నేతలు వచ్చారని, వాళ్లు నిరసన చేయాలనుకుంటే మరికొంత సమయం ఆగి ఉండాల్సిందని అన్నారు. ఇది ట్రయిలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని చెప్పారు. "ఎవరు ఎవర్ని గెంటుతారు? మేము ఇప్పటికే ఒకసారి వారిని గెంటేశాం'' అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఘటనపై కొందరు నేతలు మాట్లాడుతూ, అసెంబ్లీ మెట్ల వద్ద ఎమ్మెల్యేలు ఫైటింగ్‌కు దిగడం చాలా అరుదైన విషయమని అన్నారు. ఎన్‌సీపీ సభ్యుల ప్రవర్తన ఊహించలేదని మరికొందరు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-24T23:42:33+05:30 IST