మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ

ABN , First Publish Date - 2022-08-10T06:20:00+05:30 IST

మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం కొలువుదీరిన 41 రోజుల తర్వాత.. మంగళవారం కేబినెట్‌ విస్తరణ జరిగింది.

మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ

కొత్త మంత్రులుగా 18 మంది 

బీజేపీ, షిండే వర్గాలకు తొమ్మిది చొప్పున పదవులు

మహిళలకు దక్కని ప్రాతినిథ్యం

రాథోడ్‌, విజయ్‌ గావిట్‌, అబ్దుల్‌ సత్తార్‌ను తీసుకోవడంపై విమర్శలు



ముంబై, ఆగస్టు 9: మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం కొలువుదీరిన 41 రోజుల తర్వాత.. మంగళవారం కేబినెట్‌ విస్తరణ జరిగింది. 18 మంది కొత్త మంత్రులతో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త మంత్రుల్లో బీజేపీ, శివసేన(షిండే వర్గం) నుంచి చెరో తొమ్మిది మంది ఉన్నారు. కేబినెట్‌లో మహిళలకు స్థానం దక్కకపోవడం గమనార్హం. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


ముగ్గురిపై నేరాభియోగాలు.. విమర్శలు

షిండే వర్గంలోని సంజయ్‌ రాథోడ్‌ ఉద్ధవ్‌ మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. టిక్‌టాక్‌ స్టార్‌ అయిన ఓ మహిళ ఆత్మహత్య కేసులో ఆయన ప్రమేయం ఉందంటూ బీజేపీ ఆరోపణల నేపథ్యంలో రాథోడ్‌ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాథోడ్‌ను మంత్రివర్గంలో తీసుకోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బీజీపీ ఉపాధ్యక్షురాలు చైత్ర వాఘ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మహిళ చావుకు కారణమైన వ్యక్తి మళ్లీ మంత్రి అయ్యాడని, ఇది సరికాదని విమర్శించారు. అలాగే మంత్రులైన విజయ్‌ కుమార్‌ గావిట్‌, అబ్దుల్‌ సత్తార్‌ పైనా నేరాభియోగాలు ఉండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-08-10T06:20:00+05:30 IST