Chennai: ఇలా బైక్ నడిపిన యువకుడికి మద్రాస్ హైకోర్టు వెరైటీ శిక్ష..!

ABN , First Publish Date - 2022-10-04T22:51:16+05:30 IST

స్థానిక అన్నాశాలైలో ప్రాణాంతకంగా బైక్‌ రేస్‌ చేసిన యువకుడికి మద్రాస్‌ హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. దీంతో ఆ యువకుడు నగరంలోని..

Chennai: ఇలా బైక్ నడిపిన యువకుడికి మద్రాస్ హైకోర్టు వెరైటీ శిక్ష..!

చెన్నై: స్థానిక అన్నాశాలైలో ప్రాణాంతకంగా బైక్‌ రేస్‌ చేసిన యువకుడికి మద్రాస్‌ హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. దీంతో ఆ యువకుడు నగరంలోని అన్నాసాలైలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద బైక్‌ రేస్‌ల వల్ల కలిగే నష్టాలపై బ్యానర్‌తో ప్రచారం చేస్తూ వాహనచోదకుల్లో అవగాహన కల్పిస్తున్నాడు. గత నెల 8న అన్నాశాలైలో ఒక యువకుడు వాహనచోదకులకు ప్రాణహాని కలిగించేలా బైక్‌ రేసింగ్‌ నిర్వహించాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో నగర ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి, ఆంబూరుకు చెందిన మహ్మద్‌ హ్యారీస్‌ (19), మహ్మద్‌ సైఫాన్‌ (19) అనే వారిని అరెస్టు చేశారు. వీరిని విచారరించగా ఆ రోజు బైక్‌ రేసింగ్‌ చేసిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన కోట్ల అలెక్స్‌గా గుర్తించారు. ఈ రేసర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 14 వేల మంది ఫాలో అవుతున్నట్టు తేలింది. బైకు నంబరు ఆధారంగా అతడిని అరెస్టు చేయడంపై దృష్టిసారించారు. దీంతో అలెక్స్‌ ముందస్తు బెయిల్‌ కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జగదీష్‌ చంద్ర వినూత్న శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.



మూడు వారాల పాటు ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ట్రాఫిక్‌ సిగ్నెల్స్‌ వద్ద  అలెక్స్‌ ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేలా ప్రచారం చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, స్థానిక రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా సేవలందించాలంటూ నిబంధనలతో ముందస్తు బెయిల్‌ మంజూరు చేశారు. హైకోర్టు ఆదేశాలతో సోమవారం ఉదయం 9.30 గంటలకు  అన్నాశాలైలోని తేనాంపేట సిగ్నెల్‌లో ‘రోడ్డు సేఫ్టీని పాటించాలంటూ’ అతడు బ్యానర్‌ పట్టుకుని అవగాహనా ప్రచారం చేశాడు.

Updated Date - 2022-10-04T22:51:16+05:30 IST