High Court: ప్రధాన కార్యదర్శి పదవిని మళ్లీ ఎందుకు సృష్టించారు

ABN , First Publish Date - 2022-08-11T16:03:26+05:30 IST

అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శి పదవిని మళ్ళీ ఎందుకు సృష్టించారని మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ

High Court: ప్రధాన కార్యదర్శి పదవిని మళ్లీ ఎందుకు సృష్టించారు

                         - ఎడప్పాడిని ప్రశ్నించిన హైకోర్టు 


అడయార్‌(చెన్నై), ఆగస్టు 10: అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శి పదవిని మళ్ళీ ఎందుకు సృష్టించారని మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాల ని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ఉపసమన్వయకర్త ఎడప్పాడి కె పళనిస్వామిని ఆదేశించింది. గత నెల 11వ తేదీన నగర శివారు ప్రాంతంలోని ఒక కల్యాణమండపంలో ఆ పార్టీ సర్వసభ్య సమావేశం జరుగగా, ఈ సమావేశం చెల్లదంటూ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం(Former Chief Minister O Panneerselvam), జనరల్‌బాడీ సభ్యుడు వైరముత్తు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై బుధవారం న్యాయమూర్తి జె.జయచంద్రన్‌ విచారణ జరిపారు. ఆ సమయంలో ఇరు వర్గాల తరపున న్యాయవాదులు హాజరై తమతమ వాదనలు వినిపించారు. ముఖ్యంగా మాజీ సీఎం ఎడప్పాడి(Former CM Edappadi) తరపున హాజరైన అడ్వకేట్‌... పార్టీ నియామళి మేరకు సర్వసభ్య మండలికే పూర్తిస్థాయి అధికారం ఉందన్నారు. పార్టీ సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పోస్టులను సృష్టించే సమయంలో కూడా ఎంపిక విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని కోర్టుకు దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా, సర్వసభ్య సమావేశానికి పార్టీ ప్రధాన కార్యాలయ నిర్వాహకులు ఆహ్వానం పంపడంలో ఎలాంటి తప్పులేదని వివరణ ఇచ్చారు. ఇలా ఇరు వర్గాల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి... పార్టీ సర్వసభ్య సమావేశం పార్టీ నియమ నిబంధనల మేరకు నిర్వహించారా? లేదా? అనే అంశంపై ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) తరపున పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పైగా అన్నాడీఎంకేలో మళ్ళీ ప్రధాన కార్యదర్శి పదవిని ఎందుకు సృష్టించారని, దీనిపై కూడా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌ను పార్టీ శాశ్వత ప్రిసీడియం ఛైర్మెన్‌గా నియమించారా? అని న్యాయమూర్తి ప్రశ్నించిన న్యాయమూర్తి విచారణ  గురువారానికి వాయిదా వేశారు. 

Updated Date - 2022-08-11T16:03:26+05:30 IST