రిక్రూట్‌మెంట్‌ చేయరా?

ABN , First Publish Date - 2022-07-06T13:24:43+05:30 IST

శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకాలు ఎందుకు జరపడం లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం ప్రశ్నించింది.

రిక్రూట్‌మెంట్‌ చేయరా?

- శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయులను ఎందుకు నియమించడం లేదు ?

- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు మదురై ధర్మాసనం

- తదుపరి విచారణ 8కి వాయిదా


పెరంబూర్‌(చెన్నై), జూలై 5: శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకాలు ఎందుకు జరపడం లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రమేష్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాక తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకాలపై విధించిన స్టే తొలగించేందుకు నిరాకరించారు. రాష్ట్రంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకాలను సవాల్‌ చేస్తూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఆర్‌బీ) విజేతల సంఘం అధ్యక్షురాలు షీలా హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్‌ వేశారు. 2013లో జరిగిన టీఆర్‌బీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వేలాదిమంది వెయిటేజ్‌ విధానంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా, ప్రభుత్వం తాత్కాలిక నియామకాలు చేపట్టం సరికాదన్నారు. ఈ పిటిషన్‌ విచారించిన న్యాయమూర్తి తాత్కాలిక నియామకాల కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై రాష్ట్రప్రభుత్వం తరఫున దాఖలైన అప్పీలు పిటిషన్‌పై మంగళవారం న్యాయమూర్తి ఎంఎస్‌ రమేష్‌ విచారించారు. రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైనన సమయంలో హైకోర్టు స్టే విధించడంతో పలు జిల్లాల్లో ఖాళీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం వివరించింది. అందువల్ల నియామకాలపై స్టే తొలగించాలని రాష్ట్రప్రభుత్వం అప్పీలు పిటిషన్‌లో కోరగా, అందుకు న్యాయమూర్తి నిరాకరించారు.

Read more