Madhurai ఎయిమ్స్‌ విద్యార్థులకు రామనాథపురం కాలేజీలో అడ్మిషన్లు

ABN , First Publish Date - 2022-02-19T14:28:46+05:30 IST

మదురై ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ప్రవేశం పొందిన 50 మంది విద్యార్థులకు రామనాథపురం వైద్యకళాశాలలో ప్రవేశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు.

Madhurai ఎయిమ్స్‌ విద్యార్థులకు రామనాథపురం కాలేజీలో అడ్మిషన్లు

                           - మంత్రి సుబ్రమణ్యం


చెన్నై: మదురై ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ప్రవేశం పొందిన 50 మంది విద్యార్థులకు రామనాథపురం వైద్యకళాశాలలో ప్రవేశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. దివంగత తమిళ పండితుడు, కార్మికోద్యమ నాయకుడు సింగారవేలర్‌ 163వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం చెన్నై కలెక్టరేట్‌లోని ఆయన విగ్రహం వద్ద మంత్రి నివాళులర్పించారు. విగ్రహం దిగువన ఏర్పాటు చేసిన చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తమిళభాషాభివృద్ధి, సమాచార శాఖల కార్యదర్శి మహేశన్‌ కాశిరాజన్‌, కలెక్టర్‌ జె. విజయరాణి, సమాచార శాఖ సంచాలకులు జయశీలన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుబ్రమణ్యం మాట్లాడుతూ మదురై ఎయిమ్స్‌ ఆస్పత్రికి 2019 జనవరి 27న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, అప్పటి నుంచి ఆ ఆస్పత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు. అదే సమయంలో మదురై ఎయిమ్స్‌ కళాశాల కోటా కింద కేంద్ర ప్రభుత్వం 50 మంది విద్యార్థులను ఎంబీబీఎస్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పించేందుకు అనుమతి జారీ చేసిందన్నారు. మదురై ఎయిమ్స్‌ వైద్యకళాశాల ఆస్పత్రి నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో ఆ 50 మంది విద్యార్థులకు రామనాథపురం వైద్యకళాశాలలో ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రామనాథపురం కళాశాలలో 100 మందికి వైద్యకోర్సుల్లో ప్రవేశం కల్పించేందుకు కేంద్రం అనుమతించిందని, వీరితోపాటు అదనంగా మదురై ఎయిమ్స్‌ వైద్యకళాశాలలో సీట్లు పొందిన 50 మంది కూడా విద్యనభ్యసించనున్నారని తెలిపారు. 


డీఎంకే కూటమిదే గెలుపు

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరుగనున్న పురపాలక ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘనవిజయం సాధించనున్నదని ఆయన చెప్పారు. 1977 నుంచి తాను పలు ఎన్నికలను గమనిస్తూ వచ్చానని, ప్రజల నాడి తనకు బాగా తెలుసునని, డీఎంకే ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతృప్తి కలిగి ఉన్నారని, ఈ కారణాల వల్లే డీఎంకే అన్ని చోట్ల విజయం సాధించనున్నదని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని, ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే డీఎంకే ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు, విమర్శలు చేసినా ఓటర్లు పట్టించుకోలేదని అన్నారు.

Updated Date - 2022-02-19T14:28:46+05:30 IST