‘కేంద్ర నిధులను కొన్ని రాష్ట్రాలు వాడుకోవట్లే’

ABN , First Publish Date - 2022-08-17T06:49:04+05:30 IST

వైద్య సేవల మెరుగు, వివిధ ప్రజారోగ్య పథకాల అమలు కోసం కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో వాడుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ

‘కేంద్ర నిధులను కొన్ని రాష్ట్రాలు వాడుకోవట్లే’

న్యూఢిల్లీ, ఆగస్టు 16 : వైద్య సేవల మెరుగు, వివిధ ప్రజారోగ్య పథకాల అమలు కోసం కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో వాడుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పిలుపునిచ్చారు. కేంద్ర నిధుల వినియోగం కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు బూస్టర్‌ డోస్‌ పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ల్లో గతంలో ఏది తీసుకున్నా బూస్టర్‌ డోసుగా కార్బెవాక్స్‌ తీసుకోవచ్చుననే విషయంపై విస్త్రత ప్రచారం చేయాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న పలు పథకాలతోపాటు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై వివిధ రాష్ట్రాల మంత్రులతో మంగళవారం ఆయన సమీక్షించారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు, ఏపీ మంత్రి విడదల రజని సహా 18 రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. 2022 డిసెంబర్‌తో గడువు ముగుస్తున్నందున, కొవిడ్‌ అత్యవసర సహాయ ప్యాకేజీ-2 నిధులను వీలైనంత త్వరలో ఉపయోగించుకోవాలని మాండవీయ రాష్ట్రాలకు సూచించారు.   

Updated Date - 2022-08-17T06:49:04+05:30 IST