వడ్డీ రేట్లు పెంచిన లంక సెంట్రల్‌ బ్యాంక్‌

ABN , First Publish Date - 2022-04-10T08:10:55+05:30 IST

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

వడ్డీ రేట్లు పెంచిన లంక సెంట్రల్‌ బ్యాంక్‌

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకేనని వెల్లడి


కొలంబో, ఏప్రిల్‌ 9: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శనివారం శ్రీలంక సెంట్రల్‌ బ్యాంకు వడ్డీ రేట్లను అసాధారణ స్థాయిలో పెంచింది. 700 బేసిస్‌ పాయింట్లు పెంచేసింది. ఆర్థిక సంక్షోభంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే రాజపక్స సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని పత్రిపక్ష ‘సమాగి జన బలవేగాయ (ఎస్‌జేబీ)’ పార్టీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లంక సెంట్రల్‌ బ్యాంకు ‘స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ రేట్‌’, ‘స్టాండింగ్‌ లెండింగ్‌ ఫెసిలిటీ రేట్‌’లను 700 బేసిస్‌ పాయింట్లు పెంచి 13.50 శాతం, 14.50 శాతంగా చేసింది. ఈ నిర్ణయం శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడంతో పాటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే వడ్డీ రేట్లు పెంచినట్లు సెంట్రల్‌ బ్యాంకు వెల్లడించింది. కాగా.. శనివారం దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. కొలంబోలో వేలాది మంది నిరసనకారులు రోడ్లెక్కారు. జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతపట్టి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 


Read more