కూలీలు కావలెను!

ABN , First Publish Date - 2022-07-20T15:39:20+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో ముంపు సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అవాంతరాలేర్పడుతున్నాయి. వర్షాకాలం

కూలీలు కావలెను!

- కాల్వల నిర్మాణానికి కార్మికుల కొరత

- ప్రభుత్వ ఒత్తిడితో కాంట్రాక్టర్ల ఉక్కిరిబిక్కిరి

- పొరుగు రాష్ట్రాల నుంచి 10 వేలమంది తరలింపునకు సన్నాహాలు


చెన్నై, జూలై 19 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో ముంపు సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అవాంతరాలేర్పడుతున్నాయి. వర్షాకాలం వచ్చేలోగా వాననీటి కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభు త్వం విధించిన గడువుకు తోడు, తగినంతమంది కూలీలు దొరక్క కాంట్రాక్టర్లు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ప్రభుత్వం చేపట్టదలచిన నిర్మాణాలు అనుకున్న గడువులోగా పూర్తి చేయాలంటే కనీసం పదివేలమంది కార్మికులు అవసరమని తేలడంతో కాం ట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించేందుకు అన్వేషణ మొదలుపెట్టారు. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న వాననీటి కాల్వల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్‌, నగరపాలక శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ వాననీటి కాల్వల నిర్మాణ పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం రాక మునుపే సెప్టెంబర్‌ నాటికి ఈ పనులను పూర్తిచేయాలని కార్పొరేషన్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మెట్రోరైలు రెండో ప్రాజెక్టులో వేల సంఖ్యలో ఉత్తరాదికి చెందిన కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాననీటి కాల్వల నిర్మాణ పనులకు స్థానికంగా కూలీలు లభించకపోవడంతో ఆ కాల్వల కాంట్రాక్టర్లు కూలీల కోసం వెతుకుతున్నారు. తిరువొత్తియూరు, మనలి, అంబత్తూరు జోన్లలో వాననీటి కాల్వల నిర్మాణ పనుల్లో 1935 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 1443 మంది పొరుగు రాష్ట్రాలకు చెందినవారు. కొరట్టూరులోనూ పొరుగు రాష్ట్రాల కూలీలే పనిచేస్తున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న 200ల వార్డుల్లో వాననీటి కాల్వల నిర్మాణ పనులకు సుమారు 15వేల మంది కూలీలు అవసరమని ఆ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ పనులకు స్థానికంగా ఉండే కార్మికులు రోజువారీ కూలీ అధికంగా అడుగుతున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఏరోజు కూలీనీ ఆ రోజే చెల్లించాలని పట్టుబడుతున్నారు. అదే పొరుగు రాష్ట్రాలకు చెందిన కూలీలైతే తక్కువ మొత్తానికి పని చేయడంతో పాటు వారానికొకమారు ఇచ్చిన సంతృప్తి పడతారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ కారణంగానే కాంట్రాక్టర్లు పొరుగు రాష్ట్రాల కూలీలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వాననీటి కాల్వల పనులో ఆరువేల మంది కూలీలు మాత్రమే పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పదివేల మంది కూలీలను ఇతర రాష్ట్రాల నుండి రప్పించేందుకు కాంట్రాక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్‌, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన కూలీలను విమానాల ద్వారా నగరానికి తీసుకువచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. 

Read more