చీతాల సంబరం నేడే!

ABN , First Publish Date - 2022-09-17T08:37:52+05:30 IST

చీతాల సంబరానికి సర్వం సిద్ధమైంది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి మళ్లీ వాటి అడుగు దేశంలో పడనుంది. ఆఫ్రికా దేశం నమీబియా నుంచి ఎనిమిది చీతాలతో..

చీతాల సంబరం నేడే!

సిద్ధమైన మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కు

అక్కడే జన్మదినం జరుపుకోనున్న ప్రధాని మోదీ


భోపాల్‌, సెప్టెంబరు 16 : చీతాల సంబరానికి సర్వం సిద్ధమైంది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి మళ్లీ వాటి అడుగు దేశంలో పడనుంది. ఆఫ్రికా దేశం నమీబియా నుంచి ఎనిమిది చీతాలతో బయలుదేరిన ప్రత్యేక కార్గో విమానం పదిగంటలు ప్రయాణించి శనివారం ఉదయానికి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకుంటుంది. అక్కడనుంచి వాటిని కునో నేషనల్‌ పార్కు వద్దకు చేరుస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చీతాలను పార్కులోకి విడిచిపెడతారు. ఈ కార్యక్రమం కోసం ఇటు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, అటు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ భారీఎత్తున ఏర్పాట్లు పూర్తిచేశాయి. శనివారమే మోదీ జన్మదినం కూడా కావడం విశేషం. ఏటా ప్రత్యేకరీతిలో జన్మదినం జరుపుకునే మోదీ.. ఈసారి చీతాల సమక్షంలో రోజంతా గడపాలని నిర్ణయించుకున్నారు. దీంతో అధికారులు పార్కు పరిసరాలను అట్టహాసంగా తీర్చిదిద్దారు.


ఐదు ఆడ, మూడు మగ చీతాలను దేశంలోకి తెస్తున్నారు. ఆడ చీతాల వయసు రెండు నుంచి ఐదేళ్లు ఉండగా, మగవాటి వయసు 4.5 నుంచి 5.5 ఏళ్లు. వీటి తరలింపునకు నమీబియా కేంద్రంగా పనిచేస్తున్న చీతాల సంరక్షణ సంస్థ ‘సీసీఎఫ్‌’.. భారత్‌కు సహకరించింది. వాస్తవానికి చీతాలను తీసుకుని వస్తున్న విమానం (బోయింగ్‌ 747-400) రాజస్థాన్‌లోని జైపూర్‌కు శుక్రవారం చేరుకోవాలి. అయితే, చివరి నిమిషంలో ఈ రూట్‌మ్యా్‌పలో మార్పులు చేశారు. గ్వాలియర్‌లోని మహారాజపుర ఎయిర్‌బే్‌సకు శనివారం ఉదయం 5-6 గంటల ప్రాంతంలో విమానం చేరుకుంటుందని అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి జేఎస్‌ చౌహాన్‌ వెల్లడించారు. అక్కడనుంచి చినూక్‌ రకానికి చెందిన అతి భారీ వైమానిక హెలికాప్టరులో పార్కు వద్దకు చీతాలను తరలిస్తామని, ఇందుకోసం అక్కడ హెలీప్యాడ్‌ సిద్ధం చేశామని తెలిపారు. కాగా, చీతాలను భారత్‌కు తీసుకురావాలనే ఆలోచన మొదటిగా చేసింది తామేనని కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌లో తెలిపింది. 

Updated Date - 2022-09-17T08:37:52+05:30 IST