Courts and Judges : కొలీజియం విధానంలో న్యాయమూర్తుల నియామకంపై ప్రజల్లో అసంతృప్తి : కిరణ్ రిజిజు

ABN , First Publish Date - 2022-10-19T01:13:45+05:30 IST

కొలీజియం విధానంలో న్యాయమూర్తుల నియామకం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని

Courts and Judges : కొలీజియం విధానంలో న్యాయమూర్తుల నియామకంపై ప్రజల్లో అసంతృప్తి : కిరణ్ రిజిజు

అహ్మదాబాద్ : కొలీజియం విధానంలో న్యాయమూర్తుల నియామకం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని తనకు తెలుసునని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారత రాజ్యాంగం స్ఫూర్తి ప్రకారం న్యాయమూర్తుల నియామకం బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ప్రచురిస్తున్న వార పత్రిక ‘పాంచజన్య’ నిర్వహించిన ‘సబర్మతి సంవాద్’లో ఆయన మాట్లాడారు. 


న్యాయమూర్తుల సమయంలో దాదాపు సగం వరకు న్యాయమూర్తుల నియామకాలపై నిర్ణయం తీసుకోవడానికే ఖర్చవుతోందని, దీనివల్ల న్యాయాన్ని అందజేయడమనే న్యాయమూర్తుల ప్రధాన విధికి విఘాతం కలుగుతోందని చెప్పారు. 


కిరణ్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ, 1993 వరకు మన దేశంలో న్యాయమూర్తుల నియామకం కోసం అనుసరించిన విధానాన్ని వివరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ న్యాయమూర్తులను నియమిస్తూ ఉండేదన్నారు. ప్రతి న్యాయమూర్తి నియామకం ఆ విధంగానే జరిగేదని తెలిపారు. ఈ విషయంలో రాజ్యాంగం సుస్పష్టంగా ఉందని చెప్పారు. రాష్ట్రపతి న్యాయమూర్తులను నియమిస్తారని రాజ్యాంగం చెప్తోందన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ న్యాయమూర్తులను నియమిస్తుందని దీని భావమని తెలిపారు. 


సంప్రదింపులంటే అంగీకారం అని సుప్రీంకోర్టు 1993లో నిర్వచించిందన్నారు. వేరే ఏ రంగంలోనూ ఇటువంటి నిర్వచనం లేదన్నారు. కేవలం న్యాయ వ్యవస్థలో నియామకాల కోసం మాత్రమే సంప్రదింపులంటే అంగీకారంగా మార్చారన్నారు. న్యాయ వ్యవస్థ కొలీజియం సిస్టమ్‌ను 1998లో విస్తరించిందని చెప్పారు. 


సుప్రీంకోర్టు కొలీజియానికి భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జిలు ఈ కొలీజియంలో ఉంటారు. కొలీజియం చేసే సిఫారసులపై ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తవచ్చు, లేదా వివరణ కోరవచ్చు. అయితే ఈ కొలీజియం తన సిఫారసులను పునరుద్ఘాటిస్తే, ఆ సిఫారసులను అమలు చేయక తప్పదు. 


న్యాయమూర్తులు తమ సోదరులను న్యాయమూర్తులుగా నియమించుకునే సంప్రదాయం ప్రపంచంలో మరెక్కడా లేదని కిరణ్ రిజిజు అన్నారు. ‘‘న్యాయ శాఖ మంత్రిగా నేను గమనించిన మరొక అంశం ఏమిటంటే, న్యాయమూర్తుల ప్రధాన పని న్యాయాన్ని అందజేయడం కాగా, వారు తమ తదుపరి న్యాయమూర్తుల నియామకం గురించి ఆలోచించడానికే వారి మనసు, ఆలోచనలు, సమయంలో సగం కేటాయించవలసి వస్తోంది’’ అని చెప్పారు. 


Updated Date - 2022-10-19T01:13:45+05:30 IST