Khalistan Referendum: ఖలిస్థాన్‌పై కెనడాలో రెఫరెండం

ABN , First Publish Date - 2022-09-20T22:26:47+05:30 IST

తమకంటూ ఓ ప్రత్యేక దేశం కావాలంటూ భారత ప్రభుత్వంతో పోరాడుతున్న సిక్కు వేర్పాటువాదులు కెనడాలో

Khalistan Referendum: ఖలిస్థాన్‌పై కెనడాలో రెఫరెండం

ఒంటారియో: తమకంటూ ఓ ప్రత్యేక దేశం కావాలంటూ భారత ప్రభుత్వంతో పోరాడుతున్న సిక్కు వేర్పాటువాదులు కెనడాలో ‘ఖలిస్థాన్’పై ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) నిర్వహించారు. ఖలిస్థాన్ అనుకూల గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) కెనడాలోని బ్రాంప్టన్‌ (Brampton)లో దీనిని నిర్వహించింది. లక్షమందికిపైగా కెనడియన్ సిక్కులు ఓటింగులో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌జీని 2019లో భారత ప్రభుత్వం నిషేధించింది. దేశానికి వ్యతిరేకంగా కెనడాలో జరుగుతున్న ఈ రెఫండంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ చర్యలను అడ్డుకోవాలని కాస్తంత ఘాటుగానే కెనడాకు చెప్పింది. అయితే, కెనడా మాత్రం ససేమిరా అంది. వారు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తమ భావాలను వ్యక్తీకరిస్తున్నారని, చట్టపరిధిలో వారు చేస్తున్న ఈ చర్యలను తాము అడ్డుకోలేమని తేల్చి చెప్పింది. 


పంజాబ్‌లో సిక్కులతో కూడిన ప్రత్యేక ఖలిస్థాన్‌ దేశాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఎస్ఎఫ్‌జే ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.  పంజాబ్ ప్రజల్లో కనుక ఒకసారి ఏకాభ్రిప్రాయం కుదిరితే అప్పుడు తాము (సిక్స్ ఫర్ జస్టిస్) పంజాబ్‌ను ప్రత్యేక దేశంగా పునఃస్థాపించాలనే డిమాండ్‌తో  ఐక్యరాజ్యసమతిని, అంతర్జాతీయ సమాజాన్ని కలుస్తామన్న ‘రెఫరెండం 2020’ వెబ్‌సైట్‌ను ఉటంకిస్తూ ‘ఫస్ట్‌పోస్ట్’ తన కథనంలో పేర్కొంది.


మరోవైపు, కెనడాలోని ఖలిస్థానీ తీవ్రవాదులు గతవారం టొరొంటో(Toronto)లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ మందిరం (BAPS Swaminarayan Mandir)పై విరుచుకుపడి అపవిత్రం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత రాయబార కార్యాలయం.. దేవాలయంపై దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. కెనడా పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య మాట్లాడుతూ.. టొరొంటోలోని బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ మందిరంపై కెనడా ఖలిస్తానీ తీవ్రవాదులు దాడి చేయడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. నిజానికి ఇదొక్కటే కాదని, గతంలోనూ కెనడాలోని హిందూ ఆలయాలపై ఇలాంటి ద్వేషపూరిత దాడులు జరిగాయని అన్నారు. ఈ ఘటనలు ఇక్కడి హిందువులు ఆందోళనకు గురిచేస్తున్నట్టు చెప్పారు. 


ఆగస్టులో శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం గోడలపై ఖలిస్థానీ నినాదాలను పెయింట్‌తో రాశారు. ‘ఖలిస్థాన్ జిందాబాద్’ అని గోడలపై రాసిన స్లోగన్లకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఖలిస్థానీ గ్రూప్ ఈ రెచ్చగొట్టే స్లోగన్లు రాసింది. కాగా, కీలక ప్రదేశాల్లో ఖలిస్థానీ జెండాలను ఎగురవేస్తే నగదు బహుమతి ఇస్తానని ఖలిస్థానీ నేత గుర్‌పవంత్ సింగ్ పన్ను ఇటీవల ప్రకటించారు.  



Updated Date - 2022-09-20T22:26:47+05:30 IST