చెత్త కుప్పలో జాతీయ జెండా... గౌరవ వందనం చేసిన కేరళ పోలీస్ అధికారి...

ABN , First Publish Date - 2022-07-15T00:37:35+05:30 IST

మన దేశానికి ప్రతిరూపం అయిన జాతీయ జెండా చెత్త కుప్పలో పడి

చెత్త కుప్పలో జాతీయ జెండా... గౌరవ వందనం చేసిన కేరళ పోలీస్ అధికారి...

కొచ్చి : మన దేశానికి ప్రతిరూపం అయిన జాతీయ జెండా చెత్త కుప్పలో పడి ఉండటాన్ని చూసిన కేరళ పోలీసు అధికారి అమల్ టీకే చలించిపోయారు. వెంటనే జీపు నుంచి దిగి ఆ జెండాలో మన దేశాన్ని చూస్తూ గౌరవ వందనం చేశారు. ఈ సన్నివేశాన్ని ఆ మార్గంలో వెళ్తున్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అయి, అమల్‌కు సెలబ్రిటీలతో సహా అనేకమంది ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. 


కొచ్చిలోని ఇరుంపణమ్ సమీపంలో ఉన్న కడతు కడవు గ్రామస్థులు మంగళవారం ఓ బహిరంగ ప్రదేశంలో పెద్ద ఎత్తున జాతీయ జెండాలు, ఇండియన్ కోస్ట్ గార్డ్  లైఫ్ జాకెట్లు పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సివిల్ పోలీసు అధికారి అమల్ తన బృందంతో కలిసి జీపులో వచ్చేసరికి బహిరంగ ప్రదేశంలో జాతీయ జెండాలు, ఇండియన్ కోస్ట్ గార్డ్ లైఫ్ జాకెట్లు పెద్ద కుప్పగా పడి ఉండటాన్ని చూశారు. అమల్ వెంటనే జీపు నుంచి దిగి, ఆ జెండాల వద్దకు వెళ్ళి, గౌరవ వందనం చేశారు.  ఆ మార్గంలో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ సన్నివేశాన్ని తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయింది. అన్ని రంగాల ప్రజలు అమల్‌ను ప్రశంసిస్తున్నారు. సెలబ్రిటీలు, మేజర్ రవి వంటి ప్రముఖులు కూడా ఆయనకు ఫోన్ చేసి, ప్రశంసిస్తున్నారు. 


అమల్ మీడియాతో మాట్లాడుతూ, జాతీయ జెండా గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. జాతీయ జెండాను గౌరవించాలని తమ డిపార్ట్‌మెంట్ తమకు బోధించిందన్నారు. చెత్త కుప్పలో పడి ఉన్న జాతీయ జెండాకు గౌరవ వందనం చేసినందుకు ప్రతిఫలాన్ని తాను ఆశించలేదని చెప్పారు. అయినప్పటికీ తనకు ఉదయం నుంచి అనేక మంది ఫోన్ చేస్తున్నారన్నారు. డీసీపీ ఫోన్ చేసి, ‘‘నువ్వు యావత్తు పోలీసు దళం గర్వపడేలా చేశావు’’ అని మెచ్చుకున్నారని తెలిపారు. మేజర్ రవి తన పొరుగింట్లో ఉంటున్నారని, ఆయన కూడా తనను ప్రశంసించారని తెలిపారు. అదేవిధంగా వివిధ రంగాల్లోని ప్రముఖులు, రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బంది, సామాజిక కార్యకర్తలు కూడా తనను ప్రశంసిస్తున్నారన్నారు. 


దేశ గౌరవానికి ప్రతీకలైనవాటికి అవమానం జరిగినందుకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ కూడా దీనిపై దర్యాప్తు చేస్తోంది. 


Updated Date - 2022-07-15T00:37:35+05:30 IST