Kerala : విద్యార్థినులకు రాత్రి కర్ఫ్యూ విధింపు... కేరళ హైకోర్టు ఆగ్రహం...

ABN , First Publish Date - 2022-11-30T20:02:58+05:30 IST

కేరళలోని కొజిక్కోడ్ వైద్య కళాశాల మహిళా హాస్టల్‌లో విద్యార్థినులపై కఠినమైన ఆంక్షలను విధించడాన్ని

Kerala : విద్యార్థినులకు రాత్రి కర్ఫ్యూ విధింపు... కేరళ హైకోర్టు ఆగ్రహం...
Kerala High Court

కొచ్చి : కేరళలోని కొజిక్కోడ్ వైద్య కళాశాల మహిళా హాస్టల్‌లో విద్యార్థినులపై కఠినమైన ఆంక్షలను విధించడాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు (Kerala High Court) తప్పుబట్టింది. ప్రతి రోజూ రాత్రి 9.30 గంటలలోగా హాస్టల్‌కు చేరుకోవాలని ఎంబీబీఎస్ (MBBS) విద్యార్థినులను ఆదేశించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. వారికి రక్షణ కల్పిస్తున్నామనే ముసుగులో పితృస్వామ్యాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టింది. పితృస్వామ్యం ఏ రూపంలో ఉన్నా, దానిని తిరస్కరించవలసిందేనని తెలిపింది. కొజిక్కోడ్ వైద్య కళాశాల సంఘం ఆఫీస్ బేరర్లు, కొందరు ఎంబీబీఎస్ విద్యార్థినులు (Girl Students) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులకు (Boy Students) ఇటువంటి ఆంక్షలు లేవని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.

2019లో కేరళ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొన్న ఓ నిబంధన ప్రకారం, ఉన్నత విద్యా కళాశాలల్లో చదివే విద్యార్థినులు రాత్రి 9.30 గంటల తర్వాత హాస్టల్‌లోకి రావడం, బయటకు వెళ్ళడం చేయకూడదు. ఈ నిబంధనను పిటిషనర్లు సవాల్ చేశారు.

‘‘ఆధునిక కాలంలో, ఎటువంటి పితృస్వామ్యమైనా - స్త్రీ, పురుష ప్రాతిపదికపై రక్షణ కల్పించే ముసుగులోనైనా - తిరస్కరించవలసిందే. ఎందుకంటే, బాలికలు, బాలుర మాదిరిగానే, తమను తాము జాగ్రత్తగా చూసుకునేందుకు అవసరమైన సంపూర్ణ సామర్థ్యం కలవారే. ఒకవేళ వారికి అటువంటి సామర్థ్యం లేకపోతే, వారిని తాళం వేసి కూర్చోబెట్టడం కన్నా, వారిని ఆ విధంగా తీర్చిదిద్దేందుకు రాజ్యం, ప్రభుత్వ అధికారులు కృషి చేయాలి’’ అని హైకోర్టు తెలిపింది.

Updated Date - 2022-11-30T20:03:04+05:30 IST