Shocking: మేము ప్రభుత్వాన్ని నడపడం లేదు..మ్యానేజ్ చేస్తున్నాం

ABN , First Publish Date - 2022-08-16T22:17:27+05:30 IST

కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి షాక్...

Shocking: మేము ప్రభుత్వాన్ని నడపడం లేదు..మ్యానేజ్ చేస్తున్నాం

బెంగళూరు: కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి (JC Madhuswamy) షాక్ ఇచ్చారు. ''మేము ప్రభుత్వాన్ని నడపడం లేదు. కేవలం మ్యానేజ్ చేస్తున్నామంతే'' అంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ 'లీక్' కావడంతో అది కాస్తా సంచలనమైంది. దీంతో పార్టీకి మరింత నష్టం జరక్కుండా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అప్రమత్తమయ్యారు. వేరే సందర్భంలో (Different Context) మాట్లడిన మాటలుగా మంత్రి వ్యాఖ్యలను కొట్టిపారేశారు.


మధుస్వామి వ్యాఖ్యలపై పలువురు మంత్రుల నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. మధుస్వామి రాజీనామా చేయడం మంచిదని హార్టీకల్చర్ మంత్రి మునిరత్న వ్యాఖ్యానించారు. మరిన్ని వ్యాఖ్యలు చేయడానికి ముందు ఆయన రాజీనామా చేయాలన్నారు. కాగా, మంత్రి మునుస్వామికి, చెన్నపట్నకు చెందిన సామాజిక కార్యకర్త భాస్కర్‌కు మధ్య ఈ ఫోన్ సంభాషణ జరిగినట్టు చెబుతున్నారు. రైతులకు సంబంధించిన అంశంపై కోఆపరేటివ్ బ్యాంకుపై భాస్కర్ ఫిర్యాదు చేసినప్పుడు మంత్రి సమాధానమిస్తూ ''ఇక్కడ మేము ప్రభుత్వాన్ని నడపడం లేదు. కేవలం నెట్టుకువస్తున్నాం'' అని వ్యాఖ్యానించడం ఆ ఆడియోలో వినిపిస్తోంది. కోఆపరేషన్ మంత్రి ఎస్.టి.శోమశేఖర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూడా మునుస్వామి నిస్సహాయత వ్యక్తం చేసినట్టు ఆడియో సంభాషణల ద్వారా తెలుస్తోంది. సమస్యలన్నీ తనకు తెలుసునని, మంత్రి సోమశేఖర్ దృష్టికి తాను తీసుకు వెళ్లినప్పటకీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేనది, తాను చేసేది ఏముంటుందని మధుస్వామి ఆ ఫోన్ సంభాషణల్లో నిస్సహాయత వ్యక్తం చేశారు.


అంతా సజావుగానే ఉంది: సీఎం

దీనిపై ముఖ్యమంత్రి బొమ్మై మాట్లాడుతూ, అవి మంత్రి వేరే సందర్భంలో చేసిన వ్యాఖ్యలని, దానిని తప్పుగా అర్ధం చేసుకోకూడదని, మంత్రితో తాను మాట్లాడతానని అన్నారు. కోఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించిన వ్యాఖ్యలుగానే వాటిని చూడాలని అన్నారు. ''అంతా సజావుగా ఉంది. సమస్యేమీ లేదు'' అని బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ బొమ్మై చెప్పారు. మధుస్వామి వ్యాఖ్యలపై మంత్రులే నేరుగా విమర్శిస్తున్నారు కదా అని అడిగినప్పుడు అందరితోనూ తాను మాట్లాడతానని సీఎం క్లుప్తంగా సమాధానమిచ్చారు.

Updated Date - 2022-08-16T22:17:27+05:30 IST