Basavaraj Bommai: హనుమంతుడి జన్మస్థలంపై మళ్లీ చర్చ లేవదీసిన కర్ణాటక సీఎం

ABN , First Publish Date - 2022-08-02T02:45:55+05:30 IST

హనుమంతుడు (Lord Hanuman) ఎక్కడ జన్మించాడు? ఇటీవల ఈ చర్చ విపరీతంగా జరిగింది? తమ రాష్ట్రంలోనే

Basavaraj Bommai: హనుమంతుడి జన్మస్థలంపై మళ్లీ చర్చ లేవదీసిన కర్ణాటక సీఎం

బెంగళూరు: హనుమంతుడు (Lord Hanuman) ఎక్కడ జన్మించాడు? ఇటీవల ఈ చర్చ విపరీతంగా జరిగింది? తమ రాష్ట్రంలోనే పుట్టాడని ఆంధ్రప్రదేశ్, కాదు.. కాదు మా దగ్గరే పుట్టాడని కర్ణాటక వాదులాడుకున్నాయి.  హనుమంతుడి జన్మస్థలం తిరుమలేనని గతేడాది ఏప్రిల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పేర్కొంది. ఆంజనేయుడు అక్కడే పుట్టాడని, బర్త్ సర్టిఫికెట్ కూడా ఉన్నంత బలంగా వాదించింది.


అంతేకాదు, సాక్ష్యాలు ఇదిగో అంటూ కొన్ని వివరాలను కూడా బయటపెట్టింది. పురాణాల్లో ఆ ప్రస్తావన ఉందని చెప్పుకొచ్చింది. అయితే, అది శుద్ధ అబద్ధమని కర్ణాటకలోని కిష్కింధ ట్రస్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హనుమంతుడి జన్మస్థలం కిష్కింధ అని వాదించింది.  నాసిక్ సమీపంలోని అంజనేరిలో ఆంజనేయుడు జన్మించినట్టు మరికొందరు వాదిస్తున్నారు.


ప్రస్తుతం ఈ చర్చకు ఫుల్‌స్టాప్ పడిందనుకుంటున్న సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై(Basavaraj Bommai) మరోమారు చర్చకు తెరలేపారు. కొప్పాల్‌ జిల్లాలోని అంజనాద్రి కొండలు (Anjanadri hills) హనుమంతుడి జన్మస్థలంగా గుర్తింపు పొందాయని అన్నారు. ‘‘హనుమంతుడు అంజనాద్రి కొండల్లో జన్మించాడు. కిష్కింధ (ప్రస్తుతం హంపి)లో ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆంజనేయుడు అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడంటూ చాలామంది చాలా చెబుతున్నారు. కానీ హనుమంతుడి నిజమైన జన్మస్థలం ఇదే. కిష్కింధలోని అంజనాద్రి కొండల్లోనే ఆయన జన్మించాడు. ఇందులో ఎలాంటి గందరగోళానికి తావులేదు’’ అని బొమ్మై స్పష్టం చేశారు. 

Updated Date - 2022-08-02T02:45:55+05:30 IST