Bengaluru: పేసీఎం పోస్టర్ల కలకలం

ABN , First Publish Date - 2022-09-22T00:02:29+05:30 IST

ముడుపులు ఇస్తేనే పబ్లిక్ కాంట్రాక్టులు, ప్రభుత్వ రిక్రూట్‌మెంట్లు దక్కుతున్నాయనే ఆరోపణలను కర్ణాటక ప్రభుత్వం..

Bengaluru: పేసీఎం పోస్టర్ల కలకలం

బెంగళూరు: ముడుపులు ఇస్తేనే పబ్లిక్ కాంట్రాక్టులు, ప్రభుత్వ రిక్రూట్‌మెంట్లు దక్కుతున్నాయనే ఆరోపణలను కర్ణాటక ప్రభుత్వం ఎదుర్కొంటూ ఉండటం, ప్రభుత్వ నిర్వాకంపై కాంగ్రెస్ విస్తృత ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలో 'పేసీఎం' (PayCM) పేరుతో బెంగళూరులో పలు చోట్ల బుధవారం పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు అధికార పార్టీలో కలకలం సృష్టించాయి. పేటీఎం (Paytm) తరహాలో ఈ పోస్టర్లు ఉండగా, పోస్టర్లలోని క్యూఆర్ కోడ్ మధ్యలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై  ఫోటో ముద్రించి ఉంది. ''40 శాతం ఇక్కడ స్వీకరించబడును'' అనే మెసేజ్ కూడా అందులో ఉంది.


పబ్లిక్ వర్క్ కాంట్రాక్టులు కావాలంటే 40 శాతం ముడుపులు చెల్లించాల్సి వస్తోందంటూ కాంట్రాక్టర్ల సంఘం ఇటీవల చేసిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సీఎం ఫోటోతో  'పేసీఎం' పోస్టర్లు సిటీలో కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో అంటించిన ఈ పోస్టర్లను అధికారులు అప్పటికప్పుడు తొలగించారు. మరోవైపు, ఇది కాంగ్రెస్ పనేనంటూ బీజేపీ విరుచుకుపడింది.


''కచ్చితంగా ఇది కాంగ్రెస్ పనే. ముడుపుల ఆరోపణలపై ఇప్పటికే ముఖ్యమంత్రి బొమ్మై విచారణకు ఆదేశించారు. కేసులు కూడా నమోదయ్యాయి'' అని బీజేపీ రాష్ట్ర మీడియా సెల్ ఇన్‌చార్జి కరుణాకర్ ఖస్లే తెలిపారు. ఇలాంటి చర్యల వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని బీజేపీ రాష్ట్ర యూనిట్ సైతం సీఎంకు విజ్ఞప్తి చేసిందని అన్నారు. అవినీతి జరిగినట్టు కాంగ్రెస్ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, అలా చేయలేని పక్షంలో ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని ఆయన సవాలు చేశారు.

Updated Date - 2022-09-22T00:02:29+05:30 IST