జిన్‌ పింగ్‌ ఔట్‌?

ABN , First Publish Date - 2022-09-25T07:40:47+05:30 IST

ఉక్కు సంకెళ్ల.. నిగూఢ చైనాలో ఏదో జరుగుతోంది! అక్కడి పరిణామాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

జిన్‌ పింగ్‌ ఔట్‌?

గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు!

సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం


పీఎల్‌ఏ అధిపతిగానూ తొలగింపు

ఎస్సీవో నుంచి రాగానే అదుపులోకి..

ప్రత్యర్థులపై కక్షసాధింపే కారణం

80 కి.మీ. మేర సైనిక వాహన ర్యాలీ

దేశంలో 60శాతం విమానాలు రద్దు

లీ కుమింగ్‌ను అధ్యక్షుడిగా 

నియమించారంటూ పోస్టులు

చైనా అస్థిరమంటూ వేల ట్వీట్లు 

కమ్యూనిస్టు పార్టీ పునర్‌ వ్యవస్థీకరణ 

ముంగిట కీలక పరిణామం

స్పందించని చైనా మీడియా వర్గాలు


బీజింగ్‌, న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: ఉక్కు సంకెళ్ల.. నిగూఢ చైనాలో ఏదో జరుగుతోంది! అక్కడి పరిణామాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ (69) ఉద్వాసనకు గురయ్యారంటూ సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది..! ఆయనను రాజధాని బీజింగ్‌లో గృహ నిర్బంధం కూడా చేశారంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. జిన్‌ పింగ్‌ను పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) చీఫ్‌గానూ తొలగించారంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున విమానాల రద్దు.. బీజింగ్‌లో భారీ సైనిక బందోబస్తు వీటికి మరింత ఆజ్యం పోశాయి. ఉజ్బెకిస్థాన్‌లో షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్సీవో) సదస్సులో పాల్గొని స్వదేశానికి ఈ నెల 16న తిరిగొచ్చిన జిన్‌ పింగ్‌ను విమానాశ్రయంలోనే పీఎల్‌ఏ అదుపులోకి తీసుకున్నదని.. అనంతరం గృహ నిర్బంధం చేసిందని కథనాలు వస్తున్నాయి. వీటిని పేర్కొంటూ.. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌ చేయడం మరింత సంచలనమైంది. అయితే, వీటిని చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ ధ్రువీకరించలేదు. కాగా, వివిధ మీడియా కథనాల ప్రకారం..


పింగ్‌ ఎస్సీవో సదస్సుకు వెళ్లిన సందర్భంలో ఆయనను ఆర్మీ చీఫ్‌ పదవి నుంచి తొలగించాలని చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) నాయకత్వం నిర్ణయించింది. తర్వాత పింగ్‌ స్వదేశానికి రాగా గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. మరోవైపు విదేశాల్లో ఉంటున్న పలువురు చైనా జాతీయులు కూడా జిన్‌ పింగ్‌ గృహ నిర్బంధంలో ఉన్నారంటూ ట్వీట్లు చేశారు. పీఎల్‌ఏ.. ప్రభుత్వాన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకుందంటూ వారు పేర్కొన్నారు. మరికొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి జిన్‌ పింగ్‌ స్థానంలో పీఎల్‌ఏ జనరల్‌గా ఉన్న లీ కుమింగ్‌ను చైనా అధ్యక్షుడిగా నియమించారంటూ పోస్టులు పెట్టారు. మొత్తానికి ఈ వ్యవహారంపై వేలాదిగా ట్వీట్లు వెల్లువెత్తాయి. ‘‘పీఎల్‌ఏ వాహనాలు ఈ నెల 22న రాజధాని దిశగా కదిలాయి.


బీజింగ్‌ సమీపంలోని హువాన్‌లై కౌంటీ నుంచి హెబెయ్‌ ప్రావిన్స్‌లోని జాంగ్జియాకౌ వరకు ఈ కాన్వాయ్‌ 80 కిలోమీటర్ల మేర ఉంది. సీసీపీ నాయకత్వం.. జిన్‌ పింగ్‌ను పీఎల్‌ఏ అధిపతిగా తొలగించిన తర్వాత హౌస్‌ అరెస్టు చేశారు’’ అంటూ ఓ వీడియోను మానవ హక్కుల కార్యకర్త జెన్నిఫర్‌ జెంగ్‌ ట్వీట్‌ చేశారు. పలుసార్లు చైనా ప్రభుత్వ నిర్బంధానికి గురైన జెంగ్‌ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. మరోవైపు జెంగ్‌ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ అమెరికాలో ఉంటున్న చైనా చెందిన రచయిత గొర్డాన్‌ చాంగ్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘సైనిక వాహనాలు బీజింగ్‌ దిశగా వెళ్తున్న వీడియో.. 59 శాతం విమాన సర్వీసులు రద్దు చేసి, సీనియర్‌ అధికారుల కు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే బయటకు వచ్చింది. ఏదో జరుగుతోంది.. సీసీపీలో ముసలం రేగుతోంది. చైనా అస్థిరం’’ అంటూ గొర్డాన్‌ చాంగ్‌ విరుచుకుపడ్డారు. చైనీయులు కూడా జిన్‌పింగ్‌ ఖేల్‌ ఖతం అంటూ ట్వీట్లు చేస్తున్నా.. ఎవరివద్దా నిర్దిష్ట సమాచారం లేదు. చైనాలో ప్రస్తుతం దేశీయ విమానాలు మాత్రమే అదీ తక్కువ సంఖ్యలో తిరుగుతున్నట్లు.. ‘ఫ్లైట్‌ రాడార్‌’ చూపుతోంది. మరోవైపు శుక్రవారం చైనాలో 60 శాతం విమానాలను ఏ కారణమూ చూపకుండా నిలిపివేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.


ప్రత్యర్థులపై కక్షసాధింపే కారణమా?

దురేలేదన్నట్లు చైనాను పాలిస్తున్న జిన్‌పింగ్‌ పరిస్థితి అకస్మాత్తుగా ఎందుకు తలకిందులైంది..? జీవితకాల అధ్యక్షుడైన ఆయనకు ఉద్వాసన గతి ఎందుకొచ్చింది..? ఈ ప్రశ్నలకు సమాధానం కమ్యూనిస్టు పార్టీలో గిట్టనివారిపై పింగ్‌ కక్షసాధింపునకు దిగడమే కారణమని తెలుస్తోంది. అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చైనాలో ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష పడింది. నలుగురు అధికారుకుల జీవిత ఖైదు విధించారు. వీరంతా పింగ్‌కు ప్రత్యర్థులని ప్రచారం ఉంది. మరణశిక్షకు గురైనవారిలో న్యాయ శాఖ మాజీ మంత్రి ఫు జెంగ్‌ హువా, వాంగ్‌లైక్‌ ఉన్నారు. వ్యాపారం, పదవులు, కేసుల్లో కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చారని.. దీనికి ప్రతిగా రూ.139 కోట్లు పొందరాని ఫు మీద అభియోగాలున్నాయి. ప్రస్తుతం చైనా కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తోంది. ఇదే సమయంలో జిన్‌ పింగ్‌ ప్రత్యర్థులకు ‘శిక్షలు పడడం’ చర్చనీయాంశమైంది. కాగా, మరికొద్ది వారాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ పునర్‌ వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలోని తన వ్యతిరేకులను అణచివేసేందుకే జిన్‌ పింగ్‌.. ఇలా చేశారని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నిటి మధ్య పింగ్‌ ఏకపక్ష ధోరణిని సహించలేక సీసీపీ ఆయనను తొలగించిందని వార్తలు వస్తున్నాయి. అయితే, జిన్‌ పింగ్‌ ఎస్సీవో సదస్సు లో ఉండగా.. ఆయన వ్యతిరేకులు పార్టీ అగ్ర నాయకత్వాన్ని ఒప్పించి పదవి నుంచి తప్పించేలా చేశారని చెబుతున్నారు. తదనంతర పరిణామాలపై ప్రచారాన్ని ఈ వర్గమే మొదలుపెట్టినట్లు భావిస్తున్నారు. పింగ్‌కు ఉద్వాసనపై పెద్దఎత్తున ఊహాగానాలు వస్తున్నా.. చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ కమ్యూనిస్టు పార్టీ స్పందించలేదు. ఏ అంతర్జాతీయ మీడియా కూడా ఈ కథనాలను ధ్రువీకరించలేదు. ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఎస్సీవో సదస్సులో జిన్‌ పింగ్‌ ముభావంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కొవిడ్‌ జాగ్రత్తలంటూ ఇతర నాయకులతో కలిసి ఆయన భోజనం చేయలేదు.

Read more