ఝార్ఖండ్‌ సీఎం సోదరునిపైనా అనర్హత వేటు?

ABN , First Publish Date - 2022-09-11T08:41:17+05:30 IST

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ సోదరుడు, జేఎంఎం ఎమ్మెల్యే బసంత్‌ సొరేన్‌ అనర్హత విషయమై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) తన అభిప్రాయాన్ని రాష్ట్ర గవర్నర్‌కు పంపించినట్టు తెలిసింది.

ఝార్ఖండ్‌ సీఎం సోదరునిపైనా అనర్హత వేటు?

అభిప్రాయాన్ని గవర్నర్‌కు పంపిన ఈసీ

మైనింగ్‌ కంపెనీ వివరాలు అఫిడవిట్‌లో

పేర్కొనలేదని బీజేపీ ఫిర్యాదు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ సోదరుడు, జేఎంఎం ఎమ్మెల్యే బసంత్‌ సొరేన్‌ అనర్హత విషయమై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) తన అభిప్రాయాన్ని రాష్ట్ర గవర్నర్‌కు పంపించినట్టు తెలిసింది. శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ రమేష్‌ బైస్‌ ఈ మేరకు లేఖను అందుకున్నట్టు సమాచారం. బసంత్‌కు గనుల మైనింగ్‌ సంస్థలో భాగస్వామ్యం ఉన్నా దాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో చూపించలేదని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 9ఏను ఉల్లంఘించినందు వల్ల కూడా ఆయనను అనర్హునిగా ప్రకటించాలని కోరారు. ఈ సెక్షన్‌ ప్రకారం ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఎవరూ ప్రభుత్వానికి వస్తువులు సరఫరా చేస్తామంటూ కాంట్రాక్టు కుదుర్చుకోకూడదు. ప్రభుత్వం అమలు చేసే పనులకు కాంట్రాక్టులు తీసుకోకూడదు. దీనిని అతిక్రమించినందున ఆయనను అనర్హునిగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని గవర్నర్‌ రమేష్‌ బైస్‌ ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఆ మేరకు బసంత్‌ అనర్హతపై గత నెల 29న ఈసీ విచారణను పూర్తి చేసి, నివేదికను పంపించింది. 


సీఎం హేమంత్‌ అనర్హతపై ఇదివరకే నివేదిక

ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ గత ఏడాది తనకు తానుగా మైనింగ్‌ లీజును మంజూరు చేసుకున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై కూడా రెండు వారాల క్రితం తన అభిప్రాయాన్ని పంపించింది. అయితే దీన్ని గవర్నర్‌ ఇంతవరకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు. హేమంత్‌ ఎమ్మెల్యేగా అనర్హుడయ్యారా, లేదా అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొందని జేఎంఎం ఆరోపించింది. ఇది రాజకీయ అనిశ్చితికి దారి తీస్తుందని, అందువల్ల ఈసీ ఏమి చెప్పిందో వెల్లడించాలని ఈసీని కోరింది. 

Updated Date - 2022-09-11T08:41:17+05:30 IST