పనిమనిషే పీక కోశాడు

ABN , First Publish Date - 2022-10-05T10:13:50+05:30 IST

: జమ్ము కశ్మీర్‌లో పోలీసు ఉన్నతాధికారి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య అనంతరం పరారీలో ఉన్న అతడి

పనిమనిషే పీక కోశాడు

జమ్ము డీజీ హత్యకేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌ 

తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు గుర్తింపు 


జమ్ము, అక్టోబరు 4: జమ్ము కశ్మీర్‌లో పోలీసు ఉన్నతాధికారి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య అనంతరం పరారీలో ఉన్న అతడి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. జమ్ము కశ్మీర్‌ జైళ్ల విభాగం డీజీ హేమంత్‌ కుమార్‌ లోహియా (57) సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వారి ఇంటిలో పనిచేసే యాసిర్‌ అహ్మద్‌(23) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. దాడి జరిగిన సమయంలో లోహియా తన పాదాలకు నూనె రాసుకుంటున్నారని సీనియర్‌ పోలీసు అధికారి ముఖేశ్‌ సింగ్‌ తెలిపారు. తొలుత ఆయనకు ఊపిరాడకుండా చేసిన హంతకుడు... విరిగిన కెచప్‌ బాటిల్‌తో గొంతు కోశాడని, ఆ తర్వాత మృతదేహాన్ని మంటల్లో తగులబెట్టేందుకు ప్రయత్నించాడని వివరించారు.


మంటలను గుర్తించిన భద్రతా సిబ్బంది ఇంటి లోపలికి వెళ్లేందుకు యత్నించగా, లోపలి నుంచి గడియ పెట్టి ఉందన్నారు. ఆరు నెలల క్రితం వారి ఇంట్లో పనిలో చేరిన నిందితుడు యాసిర్‌ దూకుడు స్వభావం కలిగిన వాడని, తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. హత్యకు ఉపయోగించినట్లుగా చెబుతున్న విరిగిన కెచప్‌ సీసాతో పాటు యాసిర్‌ డైరీ, కొన్ని పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇప్పటి వరకూ దర్యాప్తులో ఎటువంటి ఉగ్ర లింకులను గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మూడు రోజుల పర్యటన ప్రారంభించిన మొదటిరోజే ఈ ఘటన వెలుగుచూసింది. 


డైరీలో ఏముందంటే...

పోలీసులు స్వాధీనం చేసుకున్న యాసిర్‌ డైరీ అతడి మానసిక స్థితిని ప్రతిబించేలా ఉంది. ‘ప్రియమైన మరణమా... నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను’, ‘నేను నా జీవితాన్ని ద్వేషిస్తున్నాను’, ‘జీవితమంటే వేదనే’ అని కొన్ని పేజీల్లో రాయగా, ‘నా జీవితం 1%, ప్రేమ 0%, ఒత్తిడి 90%, విచారం 99%, కపటమైన నవ్వు 100%’ అని ఫోన్‌ బ్యాటరీ రూపంలో గీసిన డ్రాయింగ్‌పై రాసుకున్నాడు. 

Read more