జై 5జీ

ABN , First Publish Date - 2022-10-02T09:15:05+05:30 IST

5జీ డిజిటల్‌ అనేది కామధేనువే! కోరినవన్నీ మనకు ఇస్తుంది. 2047 నాటికి భారత్‌ 40 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా ఎదిగే దిశగా 5జీ సేవలు దోహదం చేస్తాయి.

జై  5జీ

కోరినవన్నీ ఇచ్చే కామధేనువు

5జీ డిజిటల్‌ అనేది కామధేనువే! కోరినవన్నీ మనకు ఇస్తుంది. 2047 నాటికి భారత్‌ 40 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా ఎదిగే దిశగా 5జీ సేవలు దోహదం చేస్తాయి. ఇప్పుడు 2వేల డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం కూడా 20వేల డాలర్లకు చేరుతుంది. ఈ సాంకేతికత ఫలితంగా ‘సబ్‌ కా దేశ్‌-సబ్‌ కా డిజిటల్‌ వికాస్‌’ దిశగా భారత్‌ ముందు కెళ్తుంది. 2023 మార్చి నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి తాలూకా, ప్రతి తహసీల్‌లో జియో నుంచి 5జీ సేవలు అందుబాటులొకి వస్తాయి.

- రిలయన్స్‌ జియో అధినేత ముకేశ్‌ అంబానీ


5జీ సేవలను ఆవిష్కరించిన ప్రధాని.. హైదరాబాద్‌ సహా 13 చోట్ల అందుబాటులో


కొత్త శకానికి నాంది.. దేశానికి చరిత్రాత్మక రోజు

2జీ, 3జీ, 4జీల కోసం విదేశాలపై ఆధారపడ్డాం

2014లో రెండే సెల్‌ఫోన్‌ తయారీ సంస్థలు

ఇప్పుడు 200కు పైగానే కంపెనీలున్నాయి

ఎనిమిదేళ్ల క్రితం వన్‌-జీబీ ధర రూ.300..  

ప్రస్తుతం 10 రూపాయలకే 

మునుపు భారత్‌ నుంచి ఫోన్ల ఎగుమతుల్లేవ్‌

ప్రస్తుతం రూ.కోట్లలో విదేశాలకు మన ఫోన్లు

విశ్వవ్యాప్తంగా భారత్‌లో డేటా చార్జీలు తక్కువ

త్వరలోనే అందరికీ ఇంటర్నెట్‌ సేవలు: మోదీ

డిజిటల్‌ వరల్డ్‌లో 

మోదీ బ్రాండ్‌ రూ.413 కోట్లు


న్యూఢిల్లీ, అక్టోబరు 1: దేశంలో 5జీ సేవలను కొత్తశకానికి నాందిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. శనివారం ఢిల్లోని ప్రగతి మైదాన్‌లో ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) 2022 కాన్ఫరెన్స్‌ జరిగింది. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 13 నగరాల్లో 5జీ సాంకేతిక సేవలను మోదీ ఆవిష్కరించారు. 2జీ, 3జీ, 4జీ టెలికం సేవల కోసం మన దేశం ఇతర దేశాలపై ఆధారపడిందని, తాజాగా 5జీ సేవల ఆవిష్కరణ టెలికం రంగంలో ఓ విప్లవాత్మక పరిణామం అని, భారత్‌కు ఇది చరిత్రాత్మక రోజు అని అభివర్ణించారు. తమ ప్రభుత్వం ‘డిజిటల్‌ ఇండియా’ విజన్‌ను నాలుగు పిల్లర్లపై నిలబెట్టిందని.. అవి కాస్ట్‌ ఆఫ్‌ సర్వీస్‌, డిజిటల్‌ కనెక్టివిటీ, డాటా కాస్ట్‌, డిజిటల్‌-ఫస్ట్‌ అప్రోచ్‌ అని చెప్పారు. ‘అందరికీ ఇంటర్నెట్‌ సేవలు’ అందజేసే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వంలో జరిగిన 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణాన్ని గుర్తుచేస్తూ ‘‘గతంలో 2జీకి.. ఇప్పుడు 5జీకి మధ్య తేడా ఇదే’’ అని అన్నారు. 2014లో మనదేశంలో రెండే రెండు సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు ఉండేవని.. ఇప్పుడా సంఖ్య 200కుపైగా ఉందని, ఫలితంగా మొబైల్‌ ఫోన్‌ ధరలు దిగొచ్చాయని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌లోనే డేటా చార్జీలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. 2014లో వన్‌-జీబీకి చార్జీ రూ.300గా ఉంటే, ప్రస్తుతం అది కేవలం పది రూపాయలుగా ఉందని చెప్పారు. దేశంలో సగటున వ్యక్తి నెలకు 14జీబీ వినియోగిస్తాడని.. అప్పటి చార్జీల ప్రకారమైతే దీనికి రూ.4,200 అయ్యేదని.. ఇప్పుడు రూ.125-150 మధ్యే చార్జీ అవుతోందని చెప్పుకొచ్చారు. గతంలో దేశం నుంచి మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు లేవని.. ఇప్పుడు రూ.కోట్ల విలువైన ఫోన్లను ఇతర దేశాలకు పంపుతున్నామని వివరించారు. కాగా 5జీ సాంకేతిక సేవల ఆవిష్కరణ అనంతరం ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వోడాఫోన్‌ ఐడియా ప్రతినిధులు  5జీ సేవల సామర్థ్యం, ప్రయోజనంపై ప్రదర్శననిచ్చారు. రిలయెన్స్‌ జియో 5జీ సేవల ద్వారా ముంబైలోని పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడి నుంచి మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిసాలోని విద్యార్థులకు అనుసంధానం చేయించింది. ఈ సందర్భంగా విద్యార్థులను మోదీ పలకరించారు.


ఇష్టమైన సబ్జెక్‌ ఏది? అని, అభ్యసనానికి సాంకేతికత ఏ విధంగా ఉపయోగపడుతోంది? అని వారిని అడిగి వారు చెబుతుంటే ఆసక్తిగా విన్నారు. ఈ చర్చలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిసాలో స్థాపించిన స్కూల్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిర్‌టెల్‌ ప్రతినిధులు నిర్వహించిన డెమోలో యూపీ విద్యార్థిని తాను వర్చువల్‌ రియాలిటీ, ఏఆర్‌ (ఆగ్మెంటెడ్‌ రియాలిటీ) సాయంతో సోలార్‌ వ్యవస్థ గురించి అద్భుతమైన అభ్యసనా అనుభూతిని పొందానని వివరించింది.   


ఢిల్లీలో కూర్చుని స్వీడన్‌లో కారు డ్రైవ్‌ 

ప్రధాని మోదీ కారు నడిపారు. ఢిల్లీలో ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ వేదికలోని ఓ స్టాల్‌లో స్టీరింగ్‌ పట్టి..  స్వీడన్‌లో వాహనాన్ని తోలారు. 5జీ సాంకేతిక సేవల ఆవిష్కరణ అనంతరం మోదీ నావిగేషన్‌తో సెటప్‌ చేసివున్న ఆటోమేటెడ్‌ గైడెడ్‌ వెహికిల్‌ (ఏజీవీ)ను 5జీ లింక్‌ ద్వారా వర్చువల్‌గా నడిపారు. ఈ వీడియోను  మంత్రి పియూష్‌ గోయల్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. 


5జీ.. మీ ఫోన్లో ఎప్పుడు?  

ఇప్పటికిప్పుడు 5జీ సేవలను ఎయిర్‌టెల్‌ వినియోగదారులే పొందే వీలుంది. ఎందుకంటే.. ఈ సంస్థ హైదరాబాద్‌ సహా ఎనిమిది నగరాల్లో 5జీ సేవలను ఆవిష్కరించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ ఐఎంసీ సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 4జీ రేట్ల ప్రకారమే 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని.. కొత్త టారి్‌ఫను కొన్నాళ్ల తర్వాత ప్రకటిస్తామని ఎయిటెల్‌కు ప్రతినిధి ఒకరు చెప్పారు. టవర్లలో 5జీ సేవలకు సంబంధించి కొన్ని పరికరాలను పెట్టాల్సి ఉందని.. ఈ క్రమపద్ధతిలో జరుగుతాయని, అప్పటివరకూ టవర్లకు దగ్గర్లో ఉన్నవారికి 5జీ సర్వీసులు వస్తాయని ఆయన చప్పారు.  జియో నుంచి దేశవ్యాప్తంగా అన్నిచోట్లా 5జీ సేవలు 2023 మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని ఐఎంసీ సమావేశంలో ముకేశ్‌ అంబానీ చెప్పారు. వోడాపోన్‌ ఐడియా కస్టమర్లు మాత్రం 5జీ సేవల కోసం ఇంకొంత కాలం వేచిచూడక తప్పదు. ఎందుకంటే ఈ సేవలను ఎప్పుడు అందుబాటులోకి తెస్తామనేది ఆ సంస్థ ప్రకటించలేదు. 5జీ సేవలు అందించే దిశగా తమ కార్యకలాపాలు త్వరలోనే మొదలవుతాయని ఆదిత్యబిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా ఐఎంసీ సమావేశంలో పేర్కొన్నారు. 


కొత్తగా వేలమంది ఆంత్రప్రెన్యూర్లు, డజన్లలో యూనికార్న్‌లు

‘‘ప్రధాని 5జీని ఆవిష్కరించగానే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, వారాణసీ సహా 8 నగరాల్లో ఎయిటెల్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2024 నాటికి దేశవ్యాప్తంగా అన్నిచోట్లా ఎయిటెల్‌ నుంచి 5జీ సేవలు అందుబాటులోకొస్తాయి. 

- భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌


5జీ దిశగా మా ప్రయాణం త్వరలోనే

‘‘5జీ సేవలతో డిజిటల్‌ ప్రయాణంలో మనదేశం సరికొత్త దశకు చేరుకుంది. వోడాఫోన్‌ ఐడియా నుంచి 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చే పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. మా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా 24 కోట్ల మంది వినియోగిస్తుంటే వారిలో సగం గ్రామీణ కస్టమర్లే ఉన్నారు. దేశంలో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా ఉండాలనే విజన్‌కు కట్టుబడి ఉన్నాం’’   

- ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా 

Read more