కుట్ర ఉత్తిదే?

ABN , First Publish Date - 2022-09-26T07:54:04+05:30 IST

‘‘చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గృహనిర్బంధం! బీజింగ్‌ నగర వీధుల్లో సైనిక వాహనాలు..

కుట్ర ఉత్తిదే?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గృహనిర్బంధం వదంతే!

ఉజ్బెక్‌ నుంచి రాగానే క్వారంటైన్‌కి వెళ్లి ఉంటారని నిపుణుల అంచనా

విమాన సర్వీసులన్నీ యథాతథం!


‘‘చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గృహనిర్బంధం! బీజింగ్‌ నగర వీధుల్లో సైనిక వాహనాలు.. పెద్ద ఎత్తున విమానాలు, రైళ్ల రద్దు’’ అంటూ శనివారమంతా మీడియాలో, సోషల్‌ మీడియాలో హోరెత్తిన వార్తలన్నీ ఉత్తి వదంతులేనా? నిజంగా జిన్‌పింగ్‌ను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ అధిపతి పదవి నుంచి తొలగించలేదా? అంటే.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి ఈ విషయంపై ఇంత రచ్చ జరిగినా చైనా ప్రభుత్వంగానీ, ఆ దేశ మీడియా గానీ ఈ అంశంపై కిమ్మనకపోవడం పలు సందేహాలకు తావిచ్చింది.


చైనా అధికారికంగా ఖండించలేదు కాబట్టి ఈ మాట నిజమేనని కొందరు.. ఖండించలేదు కాబట్టే, ఇవన్నీ వదంతులై ఉంటాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ మాజీ ఉద్యోగి, చైనా, చైనా కమ్యూనిస్ట్‌ పార్టీకి సంబంధించిన వార్తలు, వ్యాసాలు రాసే ప్రముఖ పాత్రికేయుడు ఆదిల్‌ బ్రార్‌ మాత్రం చైనాలో సైనిక కుట్రకు ఎలాంటి ఆధారాలూ లేవని అభిప్రాయపడ్డారు. షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సు నిమిత్తం జిన్‌పింగ్‌ ఇటీవలే ఉజ్బెకిస్థాన్‌కు వెళ్లొచ్చినందున ఆయన స్వీయ క్వారంటైన్‌కు వెళ్లి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. చైనాలో గత కొన్ని రోజులుగా విమానాలు మామూలుగానే తిరుగుతున్నాయని, పెద్దగా రద్దయిన దాఖలాలేవీ లేవని ట్వీట్‌చేశారు. చైనా గగనతలంపై విమానాల వివరాలకు సంబంధించిన డేటాను కూడా ఆయన షేర్‌ చేశారు. చైనాలో ప్రభుత్వం సాఫీగా సాగుతోందనడానికి నిదర్శనంగా.. సీనియర్‌ చైనీస్‌ అధికారుల విజువల్స్‌ను కూడా ఆయన షేర్‌చేశారు. మరో ప్రముఖ పాత్రికేయుడు జక్కా జాకబ్‌ కూడా ఇవి వదంతులేనని కొట్టిపారేశారు. ‘‘చైనాలో సైనిక కుట్రలు దాదాపు అసాధ్యం. ఎందుకంటే చైనా సైన్యం సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ కనుసన్నల్లో పనిచేస్తుంది. కమ్యూనిస్ట్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీగా ఆ కమిషన్‌కు నేతృత్వం వహించేది జిన్‌పింగే’’ అని ఆయన గుర్తుచేశారు.

Read more