ఆదివారానికి బదులు శుక్రవారం సెలవు.. 33 ప్రభుత్వ స్కూళ్లపై దర్యాప్తు

ABN , First Publish Date - 2022-07-15T22:40:48+05:30 IST

దీనికి ముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగర్‌నాథ్ మహ్తో సైతం నివేదిక కోరారు. ముస్లింలు అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఆదివారానికి బదులు శుక్రవారం సెలవు కొనసాగుతున్నట్లు తనకు తెలిసిందని, ఈ విషయమై తాను విద్యాశాఖ అధికారుల నుంచి రిపోర్ట్ కోరినట్లు పేర్కొన్నారు..

ఆదివారానికి బదులు శుక్రవారం సెలవు.. 33 ప్రభుత్వ స్కూళ్లపై దర్యాప్తు

రాంచీ: ఆదివారానికి బదులు శుక్రవారం సెలవు ఇస్తున్న ప్రభుత్వ పాఠశాలల(govt schools)పై దర్యాప్తు ప్రారంభించారు. జార్ఖండ్‌(Jharkhand)లోని ధమ్కా జిల్లాలో ఉన్న 33 పాఠశాలల్లో కొంత కాలంగా ఈ తంతు కొనసాగుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ధమ్కా జిల్లా(Dumka district) విద్యా శాఖ రిపోర్టు కోరింది. అంతే కాకుండా సదరు పాఠశాలలపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. జిల్లాలోని షికరిపర బ్లాక్‌లోని 10 పాఠశాలలు, రాణిశ్వర్ బ్లాక్‌‌లోని ఎనిమిది పాఠశాలలు, సారయియహత్ బ్లాక్‌లోని ఏడు పాఠశాలలు, జర్ముండి & జామా బ్లాక్‌లలోని రెండేసి పాఠశాలలు, కతికుండ్‌ బ్లాక్‌లోని నాలుగు పాఠశాలల్లో శుక్రవారం సెలవు కొనసాగుతోంది. ఇందులో ఎక్కువ పాఠశాలలు ఉర్దూ మీడియానికి చెందినవి. ధమ్కా జిల్లా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వస్థలం కావడం గమనార్హం.


ఈ విషయమై ధమ్కా జిల్లా సుపరిండెంట్ ఆఫ్ ఎడ్యూకేషన్ అధికారి సంజయ్ కుమార్ దాస్ మాట్లాడుతూ ‘‘ఆయా బ్లాకుల్లోని విద్యాశాఖ అధికారులకు లేఖ రాశాము. 33 పాఠశాలలపై దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశాలు సైతం జారీ చేశాము. అన్ని పాఠశాలల పేర్లు ఉర్దూలో ఉన్నాయి. ఈ పాఠశాలలకు ఉర్దూ ఎలా ముడిపడి ఉంది? ఏ పరిస్థితుల రిత్యా శుక్రవారం సెలవు ఇస్తున్నారనే విషయమై విచారణ జరుగుతోంది. శుక్రవారం పాఠశాలలను మూసివేయాలని డిపార్ట్‌మెంట్ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. నివేదిక అందగానే వివరాలు వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు.


దీనికి ముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగర్‌నాథ్ మహ్తో సైతం నివేదిక కోరారు. ముస్లింలు అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఆదివారానికి బదులు శుక్రవారం సెలవు కొనసాగుతున్నట్లు తనకు తెలిసిందని, ఈ విషయమై తాను విద్యాశాఖ అధికారుల నుంచి రిపోర్ట్ కోరినట్లు పేర్కొన్నారు.

Read more