Industrial Park: ఎరైయూరులో సిప్కాట్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌

ABN , First Publish Date - 2022-11-29T08:44:59+05:30 IST

పెరంబలూరు జిల్లా ఎరైయూరులో 243 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించిన సిప్కాట్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)

Industrial Park: ఎరైయూరులో సిప్కాట్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌

- ప్రారంభించిన సీఎం

- ఫినిక్స్‌ కొథారీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన

చెన్నై, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పెరంబలూరు జిల్లా ఎరైయూరులో 243 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించిన సిప్కాట్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) సోమవారం ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఫినిక్స్‌ కొథారీ పాదరక్షల కర్మాగారానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న పది సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ప్రకారం రూ.740 కోట్ల పెట్టుబడులతో 4500 మందికి ఉపాధి కల్పించనున్నారు. పెరంబలూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న కర్మాగారాల్లో ఉపాధి అవకాశాలు మహిళలకే అధికంగా కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, తంగం తెన్నరసు, శివశంకర్‌, అన్బిల్‌ మహేష్‌, సీవీ గణేశన్‌, ఎంపీలు ఎ.రాజా, తొల్‌ తిరుమావళవన్‌, శాసనసభ్యుడు ఎం.ప్రభాకరన్‌, పారిశ్రామిక పెట్టుబడుల సమీకరణ, వాణిజ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌, రాష్ట్ర మార్గదర్శక కమిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పూజా కులకర్ణి, పెరంబలూరు జిల్లా కలెక్టర్‌ వెంకటప్రియ, కొథారి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జిన్నా రఫీక్‌ అహమ్మద్‌, ఎవర్‌వేన్‌ సంస్థ అధ్యక్షుడు రంగ్‌ వు చాంగ్‌ తదితరులు పాల్గొన్నారు.

13వేల పాఠశాలల్లో ‘వానవిల్‌ మండ్రాలు’

తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు జిల్లాల్లో రెండు రోజుల పర్యటనకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) సోమవారం ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి తిరుచ్చి వెళ్ళారు. అక్కడి నుంచి కారులో తిరుచ్చి సమీపం కాట్టూరు పాప్పాకురిచ్చి ఆదిద్రావిడ బాలికోన్నత పాఠశాలకు చేరుకున్నారు. ఆ పాఠశాలలో ఏర్పాటైన సభలో ఆయన పాల్గొని విద్యార్థుల్లో విజ్ఞాన, గణిత శాస్త్రాలపై ఆసక్తి పెంచేలా వానవిల్‌ మండ్రం అనే పథకాన్ని ప్రారంభించారు. తర్వాత విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు బైకుల్లో బయలుదేరిన టీచర్లను జెండా ఊపి సాగనంపారు. విద్యార్థుల ఎదుట ప్రయోగాల సహితంగా పాఠాలు నేర్పేందుకు, గణిత పాఠాలను సులువుగా బోధించటానికి ఈ ఉపాధ్యాయులు ద్విచక్రవాహనాల్లో పాఠశాలలకు వెళతారు. వీరందరూ బీఎస్సీ, ఎమ్మెస్పీ, బీఈడీ చదివిన వారే. ఇదివరకే వీరు ‘ఇళ్లవద్దకే విద్య’ అనే పథకంలోనూ సేవలందించారు. ప్రస్తుతం వానవిల్‌ మండ్రం పథకం ప్రకారం వీరు తమ వెంట ప్రయోగాలకు అవసరమైన కీలకమైన 30 పరికరాలను బ్యాగుల్లో తీసుకెళతారు. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో 13,210 ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు నుంచి ఎనిమిది తరగతులు చదివే విద్యార్థుల కోసం ఈ వానవిల్‌ మండ్రాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల మేరకు కేటాయించింది. ఈ కొత్త పథకాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆ పాఠశాలలో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు కొత్తగా రూపొందించిన వైజ్ఞానిక పరికరాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో చర్చించారు. ‘అంతటా సైన్స్‌, అన్నింటా గణితం’ అనే సరికొత్త నినాదంతో పాఠశాలల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వానవిల్‌ మండ్రం ఏర్పాటు చేయనున్నట్లు స్టాలిన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, తంగం తెన్నరసు, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, తిరుచ్చి మేయర్‌ ఎం.అన్బళగన్‌, ఎంపీలు తిరుచ్చి శివా, ఎస్‌. తిరునావుక్కసర్‌, శాసనసభ్యులు ఎస్‌. ఇనికో ఇదయరాజ్‌, ఎస్‌. కదిరవన్‌, పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉషా, తిరుచ్చి జిల్లా కలెక్టర్‌ ఎం. ప్రదీప్‌ కుమార్‌ దితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-29T08:45:02+05:30 IST