Economy : చాలా దేశాల కన్నా భారత్ ఆర్థిక వ్యవస్థ బాగుంది : ఐఎంఎఫ్

ABN , First Publish Date - 2022-10-12T18:46:26+05:30 IST

చాలా దేశాల ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉన్న

Economy : చాలా దేశాల కన్నా భారత్ ఆర్థిక వ్యవస్థ బాగుంది : ఐఎంఎఫ్

న్యూఢిల్లీ : చాలా దేశాల ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉన్న సమయంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ సాపేక్షంగా మెరుగైన స్థితిలో ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఆసియా-పసిఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ (Krishna Srinivasan) చెప్పారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వృద్ధి నెమ్మదిస్తోందని, ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోందని చెప్పారు. 


ఐఎంఎఫ్ (International Monetary Fund) ఆసియా-పసిఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను చూడమని చెప్పారు. ఇది సర్వత్రా వేధిస్తున్న సమస్య అని తెలిపారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వృద్ధి నెమ్మదిస్తోందన్నారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతోందని చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు ఆర్థిక వ్యవస్థ గల దేశాలు ఈ ఏడాది కానీ, వచ్చే సంవత్సరం కానీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉందని తాము భావిస్తున్నామని చెప్పారు. ద్రవ్యోల్బణం విపరీతంగా ఉందన్నారు. మొత్తం మీద పరిస్థితి ఇదేనని తెలిపారు. 


‘‘దాదాపు ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోంది. ఈ నేపథ్యంలో భారత దేశం మెరుగ్గా ఉంది. ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో పోల్చినపుడు భారత దేశం సాపేక్షంగా మెరుగైన స్థితిలో ఉంది’’ అని చెప్పారు. 


ఐఎంఎఫ్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో 2022లో భారత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను సవరించింది. ఈ రేటు 6.1 శాతం ఉంటుందని జోస్యం చెప్పింది. జూలైలో విడుదల చేసిన నివేదికలో ఈ రేటు 7.4 శాతం అని జోస్యం చెప్పింది. ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా భారత దేశ అంచనా వృద్ధి రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ అంచనాను సవరించినప్పటికీ ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే భారత దేశ వృద్ధి వేగంగా ఉంటుందని అంచనా వేశాయి. భారత దేశం తర్వాతి స్థానాల్లో చైనా (4.4 శాతం), సౌదీ అరేబియా (3.7 శాతం), నైజీరియా (3 శాతం) ఉన్నాయి. అమెరికా వృద్ధి రేటు 1 శాతం అని, రష్యా, ఇటలీ, జర్మనీ ఆర్థిక వ్యవస్థల వృద్ధి తిరోగమనంలో ఉంటుందని జోస్యం చెప్పాయి. 


Updated Date - 2022-10-12T18:46:26+05:30 IST