జనాభాలో చైనాను తలదన్ననున్న భారత్.. వచ్చే ఏడాది అగ్రస్థానానికి India

ABN , First Publish Date - 2022-07-11T21:45:25+05:30 IST

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా వచ్చే ఏడాది భారత్ రికార్డులకెక్కబోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం

జనాభాలో చైనాను తలదన్ననున్న భారత్.. వచ్చే ఏడాది అగ్రస్థానానికి India

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా వచ్చే ఏడాది భారత్ రికార్డులకెక్కబోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day-జులై 11) సందర్భంగా ఐక్యరాజ్య సమితి(UN) విడుదల చేసిన తాజా జాబితాలో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ ఏడాది నవంబరు మధ్య నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఎకనమిక్ అండ్ సోషల్ అఫైర్స్ పాపులేషన్ డివిజన్ అంచనా వేసింది. 2030 నాటికి ఆ సంఖ్య 8.5 బిలియన్లకు, 2050 నాటికి 9.7 బిలియన్లకు చేరుకుంటుందని పేర్కొంది. 


రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ జనాభా వృద్ధి రేటు నెమ్మదిగా ఉందని తెలిపింది. 2080 నాటికి 10.4 బిలియన్లకు చేరుకుంటుందని, 2100 సంవత్సరంలోనూ అదే కొనసాగుతుందని అంచనా వేసింది. ఈసారి ప్రపంచ జనాభా దినోత్సవం ఓ కీలక మైలురాయి సంవత్సరంగా మారబోతోందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్(António Guterres) పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరుకోబోతోందని అన్నారు. వైవిధ్యాన్ని జరుపుకునేందుకు ఇదో సందర్భమని పేర్కొన్న ఆయన.. అదే సమయంలో భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్న విషయాన్ని ఇది గుర్తు చేస్తుందని వివరించారు. 


నివేదికలో ఉన్న విషయాలివే..


* అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం (India) మొదటి స్థానంలో నిలవబోతోంది. 2023లో చైనా (China)ను భారత్ అధిగమిస్తుంది. 2050 నాటికి పెరుగుతుందని అంచనా వేస్తున్న ప్రపంచ జనాభాలో సగం భారత్  సహా ఎనిమిది దేశాల్లోనే ఉంటుంది. 

* మిగతా ఏడు దేశాలు.. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా 

* ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియా, ఓషియానాలలో జనాభా పెరుగుదల నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ శతాబ్దం చివరి నాటికి సానుకూలంగా ఉంటుంది.

 * తూర్పు, ఆగ్నేయాసియా, మధ్య, దక్షిణాసియా, లాటిన్ అమెరికా, కరేబియన్, యూరప్, ఉత్తర అమెరికాలలో జనాభా పతాకస్థాయికి చేరుకుని, 2100 నాటికి తగ్గదల కనిపిస్తుంది. 

*  2010 నుంచి 2021 మధ్య పది లక్షల మందికిపైగా వలస వెళ్లిపోతున్న పది దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. అత్యధికంగా పాకిస్థాన్ నుంచి 16.5 మిలియన్ల మంది బయటకు వెళ్లిపోయారు. 

* అభద్రత, సంఘర్షణల కారణంగా సిరియా, వెనుజులా, మయన్మార్ వంటి దేశాల నుంచి జనం వలస వెళ్లిపోతున్నారు.

* 2019లో ప్రపంచ ఆయుర్దాయం 72.8 సంవత్సరాలు కాగా, 2021లో అది 71.0 సంవత్సరాలకు పడిపోయింది. చాలా వరకు కరోనా మహమ్మారే ఇందుకు కారణం. 

* అతి తక్కువ అభివృద్ధించిన 46 దేశాలు మాత్రం జనాభాలో మాత్రం వేగంగా వృద్ధి నమోదవుతోంది. 2022-2050 మధ్య ఆయా దేశాల్లో జనాభా రెండింతలయ్యే అవకాశం ఉంది.


Read more