India, Srilanka, China: హంబంటోటా పోర్టులోకి చైనీస్ నౌకకు అనుమతి... శ్రీలంకపై భారత్ అసంతృప్తి...

ABN , First Publish Date - 2022-08-05T18:43:22+05:30 IST

కష్టకాలంలో ఆదుకున్న భారత దేశం (India) అభ్యంతరాలను

India, Srilanka, China: హంబంటోటా పోర్టులోకి చైనీస్ నౌకకు అనుమతి... శ్రీలంకపై భారత్ అసంతృప్తి...

న్యూఢిల్లీ : కష్టకాలంలో ఆదుకున్న భారత దేశం (India) అభ్యంతరాలను శ్రీలంక (Sri Lanka) పట్టించుకోవడం లేదు. పరిశోధన సాకుతో వస్తున్న చైనా (China) నౌకకు అనుమతి ఇచ్చింది. దీంతో శ్రీలంక తీరు పట్ల భారత్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే చైనా నుంచి తీసుకున్న రుణాలు శ్రీలంకను ఇరకాటంలోకి నెట్టినట్లు తెలుస్తోంది. 


చైనా అంతరిక్ష పరిశోధన నౌక యువాన్ వాంగ్ 5 (Yuan Wang 5) శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయానికి బయల్దేరింది. ఆగస్టు 11న ఇక్కడికి చేరుకుంటుంది. ఇది పరిశోధన, సర్వే నౌక. ఉపగ్రహాల సాయంతో పరిశోధనలు చేస్తుంది. పొరుగున ఉన్న భారత దేశంలోని నౌకాశ్రయాలు, ఇతర వ్యూహాత్మక ప్రాంతాలపై నిఘా పెట్టి, వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటుంది. అందుకే దీనిని ఈ నౌకాశ్రయంలోకి అనుమతించడంపై శ్రీలంక ప్రభుత్వానికి భారత్ అభ్యంతరం తెలిపింది. 


ఆగస్టు 11 నుంచి 17 వరకు హంబంటోటాలో...

ఇది లుయాంగ్ క్లాస్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక. దీనిలో టైప్ 071 ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్ ఉంది. ఇది హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుంది. అదేవిధంగా ఆఫ్రికా తూర్పు ప్రాంతంలోని డ్జిబౌటీలో ఉన్న చైనీస్ స్థావరానికి కూడా వెళ్తుంది. ఇది ఆగస్టు 11 నుంచి 17 వరకు హంబంటోటాలో ఉంటుంది. ఇంధనాన్ని నింపుకోవడం, విశ్రాంతి తీసుకోవడం వంటివాటి కోసం దీనికి రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రణిల్ విక్రమసింఘే ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో 2017లో హంబంటోటా (Hambantota) పోర్టును చైనాకు 99 సంవత్సరాల కౌలుకు ఇచ్చారు. 


శ్రీలంకపై తీవ్ర ఒత్తిడి

ఈ నౌకను ఈ పోర్టుకు అనుమతించాలని శ్రీలంకపై చైనా పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అనుమతిని నిరాకరిస్తే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని కొలంబోలోని చైనా రాయబారి శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. 


భారత నావికా దళం అభ్యంతరం 

సైనిక నిఘా నౌకను హంబంటోటా నౌకాశ్రయంలో కొద్ది రోజులు ఉంచడంపై భారత నావికా దళం (Indian Navy) అభ్యంతరం తెలిపింది. అయినప్పటికీ శ్రీలంక కేబినెట్ అధికార ప్రతినిధి బందుల గుణవర్దన ఇటీవల మాట్లాడుతూ, ఈ నౌక కేవలం రిఫ్యూయలింగ్ కోసమే వస్తోందని చెప్పారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ఇరు దేశాలతో కలిసి పని చేయడానికి దౌత్యపరమైన కృషి జరుగుతుందని మంత్రివర్గానికి రణిల్ విక్రమసింఘే చెప్పారని తెలిపారు. 


అప్పుల భారం విపరీతం

హంబంటోటా నౌకాశ్రయంలోకి చైనా నౌక ప్రవేశించడాన్ని శ్రీలంక సమర్థించుకుంటున్నప్పటికీ, అసలు వాస్తవం ఏమిటంటే, చైనీస్ ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి అత్యధిక వడ్డీలకు శ్రీలంక అప్పులు తీసుకుంది. శ్రీలంక తీసుకున్న మొత్తం విదేశీ రుణాల్లో 10 శాతానికి పైగా చైనా నుంచి తీసుకున్నవే. హంబంటోటా పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల కోసం ఈ అప్పులను తీసుకుంది. కాబట్టి చైనాకు ఇబ్బంది కలిగించే పనిని శ్రీలంక చేయడం సాధ్యం కాదు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చేపట్టిన బెల్ట్ రోడ్ ఇనీషియేటివ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పాకిస్థాన్ మాదిరిగానే శ్రీలంక కూడా వ్యవహరిస్తోంది. 


హంబంటోటాకు వస్తున్న చైనీస్ సైనిక నౌక ఓషన్ మ్యాపింగ్ చేస్తుందని తెలుస్తోంది. చైనీస్ పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) నావికా దళం నిర్వహించే జలాంతర్గామి కార్యకలాపాలకు ఓషన్ మ్యాపింగ్ చాలా అవసరం. అందుకే శ్రీలంక చర్యల పట్ల భారత్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. శ్రీలంక తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నపుడు నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం 3.5 బిలియన్ డాలర్లకుపైగా వివిధ రూపాల్లో ఇచ్చింది. ఆహారం, ఇంధనం, వంటగ్యాస్ వంటివాటిని సరఫరా చేసింది. అయినప్పటికీ భారత్ అభ్యంతరాలను శ్రీలంక పట్టించుకోవడం లేదు.


Read more