రష్యా నుంచి పెరిగిన దిగుమతులు

ABN , First Publish Date - 2022-07-26T09:56:51+05:30 IST

రష్యా నుంచి భారత్‌కు ఈ ఏడాది దిగుమతులు భారీగా పెరిగాయి. కేంద్ర వాణిజ్య శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 8.6 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులు రష్యా నుంచి భారత్‌కు వచ్చాయి.

రష్యా నుంచి పెరిగిన దిగుమతులు

న్యూఢిల్లీ, జూలై 25: రష్యా నుంచి భారత్‌కు ఈ ఏడాది దిగుమతులు భారీగా పెరిగాయి. కేంద్ర వాణిజ్య శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 8.6 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులు రష్యా నుంచి భారత్‌కు వచ్చాయి. 2021లో ఇదే కాలంలో ఈ దిగుమతుల విలువ 2.5 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అంటే గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మూడున్నర రెట్లు అధికంగా దిగుమతులు నమోదయ్యాయి. ఈ సారి ఏప్రిల్‌, మే నెలల్లోనే రష్యా నుంచి వచ్చిన దిగుమతుల విలువ 5 బిలియన్‌ డాలర్లు దాటింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా అనేక ఐరోపా దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను భారత్‌ తనకు అనుకూలంగా మలుచుకుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా.. రష్యా నుంచి భారత్‌కు దిగుమతుల్లో ముడి చమురుదే ప్రధాన వాటా. ఆ తర్వాత ఎరువులు, వంటనూనెలను మనదేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంది. బొగ్గు దిగుమతులు కూడా పెరిగాయి. అయితే వజ్రాలు తదితర విలువైన రాళ్ల దిగుమతులు తగ్గాయి. మరోవైపు భారత్‌ నుంచి ఎగుమతులు తగ్గడంతో వర్తక లోటు పెరుగుతోంది. 2022-23 ఏప్రిల్‌, మే నెలల్లో భారత్‌ వర్తకలోటు 4.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గతేడాది ఇదే కాలంలో ఈ లోటు 900 మిలియన్‌ డాలర్లు మాత్రమే.  గతేడాది ఏప్రిల్‌, మే నెలల్లో ముడిచమురు దిగుమతులేమీ లేకపోగా.. ఈ ఏడాది ఇదేకాలంలో 4.2 బిలియన్‌ డాలర్ల విలువైన ముడిచమురును దేశం దిగుమతి చేసుకుంది. 

Read more