Income Tax Department: మళ్లీ ఐటీ అలజడి

ABN , First Publish Date - 2022-11-24T08:16:29+05:30 IST

పప్పు ధాన్యాలు, కిరోసిన్‌ దిగుమతులపై సరిగ్గా పన్ను చెల్లించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు సంస్థల

Income Tax Department: మళ్లీ ఐటీ అలజడి

- 40 చోట్ల సోదాలు

చెన్నై, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పప్పు ధాన్యాలు, కిరోసిన్‌ దిగుమతులపై సరిగ్గా పన్ను చెల్లించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు సంస్థల కార్యాలయాల్లో ఆదాయపన్నుశాఖ(Income Tax Department) సోదాలు చేపట్టింది. బుధవారం ఒకే సమయంలో 40 చోట్ల ఈ తనిఖీలు నిర్వహించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్‌ దుకాణాల్లో అందించే పామాయిల్‌, కిరోసిన్‌, పప్పు ధాన్యాలు తదితర దిగుమతుల కోసం ప్రభుత్వం కొన్ని సంస్థలకు అనుమతిచ్చింది. చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఐదు సంస్థలు పప్పు ధాన్యాలు, కిరోసిన్‌ తదితర సరకులు హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి వాటిని ప్యాక్‌ చేసి రేషన్‌ దుకాణాలకు అందిస్తున్నాయి. ఈ సంస్థలు సరుకుల దిగుమతులకు సంబంధించి పన్ను చెల్లించలేదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తండయార్‌పేట కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థకు చెందిన ఏడు దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తండయార్‌పేట చెక్‌పోస్ట్‌ ప్రాంతంలోని ఆ సంస్థకు సొంతమైన గోదాము, యజమాని, అకౌంటెంట్‌ ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. అలాగే, ఈ సంస్థకు చెందిన టి.నగర్‌, మడిపాక్కం, అన్నాసాలైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో కూడా సోదాలు చేపట్టారు. అలాగే మిగిలిన నాలుగు సంస్థలకు చెందిన కార్యాలయాలు, యజమానులు, ముఖ్యమైన ఉద్యోగుల నివాసాల్లోనూ ఉదయం 6 గంటల నుంచి వందమందికి పైగా అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక పత్రాలు, హార్డ్‌డి్‌స్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తనిఖీల సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-11-24T08:16:31+05:30 IST