నాటోలో చేరితే మూడో ప్రపంచ యుద్ధమే..

ABN , First Publish Date - 2022-10-14T09:33:45+05:30 IST

నాటో కూటమిలో సత్వర సభ్యత్వం కోరుతూ గత నెలలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బిడ్‌ వేయడంపై రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఉప కార్యదర్శి అలెగ్జాండర్‌ వెనెడిక్టొవ్‌ తీవ్ర హెచ్చరికలు..

నాటోలో చేరితే మూడో ప్రపంచ యుద్ధమే..

ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా

ఉద్రిక్తతల రీత్యా రహస్యంగా నాటో దేశాల ‘అణు’ చర్చలు

కీవ్‌, బ్రస్సెల్స్‌, ఐక్యరాజ్య సమితి, అక్టోబరు 13: నాటో కూటమిలో సత్వర సభ్యత్వం కోరుతూ గత నెలలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బిడ్‌ వేయడంపై రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఉప కార్యదర్శి అలెగ్జాండర్‌ వెనెడిక్టొవ్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నాటోలో ఉక్రెయిన్‌ చేరితే మూడో ప్రపంచ యుద్ధమేనని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో ఉక్రెయిన్‌కు బాగా తెలుసంటూ పరోక్ష సంకేతాలిచ్చారు. గురువారం కూడా రష్యా ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. ఒకటీ, రెండు కాదు.. ఏకంగా 40పైగా  క్షిపణులతో మైఖోలైవ్‌లోని మౌలిక వసతుల, కీవ్‌లోని శరణార్థుల శిబిరాలు, నికొపొల్‌లో ఇళ్లు, గ్యాస్‌ పైప్‌లైన్‌లపై ఇరాన్‌ డ్రోన్లతో దాడులకు దిగింది. ప్రతిగా ఉక్రెయిన్‌ వైమానిక దళం రష్యాకు చెందిన 25 లక్ష్యాలపై 32 దాడులు చేసింది. కాగా, రష్యా ఇటీవల నిర్వహించిన రిఫరెండంను ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో అత్యధిక దేశాలు ఓటు వేసిన మరుసటి రోజే ఇలా జరగడం గమనార్హం. 

నాటో ‘అణు’ చర్చలు.. వచ్చేవారం సన్నాహాలు

వ్యూహాత్మక అణ్వాయుధాల వాడకంపై పుతిన్‌ హెచ్చరికల రీత్యా.. నాటో దేశాల రక్షణ మంత్రులతో కూడిన న్యూక్లియర్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ బ్రస్సెల్స్‌లో గురువారం రహస్యంగా సమావేశమైంది. వచ్చే వారం ‘అణు విన్యాసాలు’ నిర్వహించాలని ప్రణాళికలు వేస్తోంది. ఉక్రెయిన్‌ గగనతల రక్షణకు ఆధునిక ఆయుధాలు ఇవ్వాలన్న అమెరికా, నాటో దేశాల నిర్ణయం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 

Updated Date - 2022-10-14T09:33:45+05:30 IST