ఒకరికి అన్యాయం జరిగిందని.. ఇంకొకరిని బలిచేస్తారా?

ABN , First Publish Date - 2022-10-08T09:02:04+05:30 IST

ఒకానొక నేరం ద్వారా ఒకరికి అన్యాయం జరిగిందని దానికి పరిహారంగా ఎలాంటి సాక్ష్యాధారాల్లేకుండా మరొకరికి అన్యాయం చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఒకరికి అన్యాయం జరిగిందని.. ఇంకొకరిని బలిచేస్తారా?

ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో సుప్రీం ఆగ్రహం

ఉరిశిక్ష పడిన నిందితుడి విడుదల

న్యూఢిల్లీ, అక్టోబరు 7: ఒకానొక నేరం ద్వారా ఒకరికి అన్యాయం జరిగిందని దానికి పరిహారంగా ఎలాంటి సాక్ష్యాధారాల్లేకుండా మరొకరికి అన్యాయం చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడన్న అభియోగంపై ఉరిశిక్షను ఎదుర్కొంటున్న ఛోట్‌కవూ అనే వ్యక్తిని విడుదల చేయాలని ఆదేశించింది. ఇది 2012 నాటి కేసు. హోలీ సందర్భంగా నృత్య ప్రదర్శన చూపించేందుకు ఛోట్‌కవూ అనే వ్యక్తి తన ఆరేళ్ల మేనకోడలిని తీసుకెళ్లాడు. ఆ తర్వాతి రోజు చెరకు పొలాల్లో పాప మృతదేహం కనిపించింది. ఛోట్‌కవూ ఆ అమ్మాయిని వెంట తీసుకెళ్లడం తాను చూశానని గ్రామస్థుడొకరు చెప్పారు. ఈ వాంగ్మూలంతోపాటు సందర్భోచిత సాక్ష్యాల ఆధారంగా ఛోట్‌కవూ అత్యాచారం, హత్య చేసినట్లు సెషన్స్‌ కోర్టు నిర్ధారించి అతడికి ఉరిశిక్ష విధించింది. అలహాబాద్‌ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. ఛోట్‌కవూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి శిక్షను కొట్టివేసింది. ఛోట్‌కవూ నేరం చేశాడనేందుకు వీసమెత్తు ఆధారం కూడా లేదని, ప్రాసిక్యూషన్‌ అతడికి అన్యాయం చేసిందని తేల్చిచెప్పింది. ఇలాంటి కేసుల్లో వైద్యపరమైన ఆధారాలు ప్రధానం. ఈ కేసులో ఫోరెన్సిక్‌/వైద్యపరమైన ఆధారాలను సమర్పించలేదు అని కోర్టు పేర్కొంది.

Updated Date - 2022-10-08T09:02:04+05:30 IST