హిందీని బలవంతంగా రుద్దితే దేశం ముక్కలే

ABN , First Publish Date - 2022-10-12T08:04:15+05:30 IST

హిందీ భాషను బలవంతంగా రుద్దితే దేశం ముక్కలవుతుందని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎ్‌స.

హిందీని బలవంతంగా రుద్దితే దేశం ముక్కలే

కేంద్రానికి వైగో, టీఎన్‌సీసీ హెచ్చరిక 

చెన్నై, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): హిందీ భాషను బలవంతంగా రుద్దితే దేశం ముక్కలవుతుందని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎ్‌స.అళగిరి మంగళవారం వేర్వేరుగా కేంద్రాన్ని హెచ్చరించారు. ‘‘కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సారథ్యంలో ఏర్పాటైన పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ ఇటీవల సమావేశమై మొత్తం 112 సిఫార్సులతో 11వ నివేదికను రాష్ట్రపతి కార్యాలయానికి పంపించింది. అధికార భాష పేరుతో దేశ వ్యాప్తంగా హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం గుట్టుచప్పుడుకాకుండా చర్యలు చేపట్టింది. ఇది హిందీ భాష తెలియని ప్రజలపై సాగించే యుద్ధమే. ఆంగ్ల భాషను పూర్తిగా అరికట్టి, హిందీ భాషను అన్ని స్థాయిల్లో నిర్బంధం చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న మన దేశంలో ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి అనే పేరుతో హిందుత్వ శక్తులు ప్రచారం చేయడం ఖండించతగ్గది. సంస్కృతం, లేదా ఆ ఛాయలు ఉండే హిందీని బలవంతంగా అమలు చేయడమే ఆ ప్రచార లక్ష్యం. ఇదేపరిస్థితి కొనసాగిన పక్షంలో దేశంలో అలజడి చెలరేగి, ప్రశాంత వాతావరణానికి భగ్నం ఏర్పడుతుంది. ఇది మరో వివాదానికి దారితీస్తుది’’ అని వైగో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 


తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది: టీఎన్‌సీసీ

తమిళ ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎ్‌స.అళగిరి మండిపడ్డారు. దీనివల్ల కేంద్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బీజేపీ పాలనలో హిందీని అధికారిక భాషగా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. గత 75 ఏళ్లుగా భిన్నత్వంలో ఏకత్వంగా భారత ప్రజాస్వామ్యం ఉందని, దీనికి బీజేపీ పాలకులు తిలోదకాలిచ్చి హిందీని దేశ ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగిన పక్షంలో దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఆయన హెచ్చరించారు. 

Read more