Lakhimpur Kheri case: తప్పు చేసి ఉంటే పారిపోవాలి కదా: లఖిపూర్ ఖేరి నిందితుల తల్లి

ABN , First Publish Date - 2022-09-16T00:37:36+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి (Lakhimpur Kheri)లో అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు దళిత బాలికలపై అత్యాచారం

Lakhimpur Kheri case: తప్పు చేసి ఉంటే పారిపోవాలి కదా: లఖిపూర్ ఖేరి నిందితుల తల్లి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి (Lakhimpur Kheri)లో అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు దళిత బాలికలపై అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. బాలికలపై అత్యాచారానికి పాల్పడిన యువకులు ఆపై గొంతు నులిమి చంపేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వారి మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. విషయం వెలుగులోకి వచ్చాక ఈ ఘటన ప్రకంపనలు రేపింది. రాజకీయంగానూ తీవ్ర విమర్శలకు కారణమైంది. పోస్టుమార్టంలో బాధిత బాలికలపై అత్యాచారం జరిగినట్టు వెల్లడైంది. ఆ తర్వాత వారిని గొంతు నులిమి చంపేసినట్టు నివేదిక పేర్కొంది. 


ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. తమ పిల్లలు అమాయకులని పేర్కొన్నారు. బాలికలపై అత్యాచారం చేసి, హత్య చేసిన వారిపై తీసుకునే చర్యలు చూసి రాబోయే తరాలు కూడా వణికిపోతాయని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ పేర్కొన్నారు. కాగా, నిందితుల్లో ఎవరూ మైనర్లు లేరని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అందరూ యువకులేనని స్పష్టం చేశారు. 


అరెస్ట్ అయిన ఆరుగురు నిందితుల్లో నలుగురి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. నేరం జరిగిన సమయంలో నలుగురూ కలిసి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల మధ్య రేషన్ కొనుగోలు చేసేందుకు వెళ్లినట్టు చెప్పారు. ఒక వేళ తన కుమారులు కనుక నేరం చేసి ఉంటే ఘటనా స్థలం నుంచి పారిపోయి ఉండేవారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజుర్, సోహైల్, కరీముద్దీన్ తల్లి పేర్కొన్నారు. నిజంగానే వారు ఆ పని చేసినట్టు ఉంటే వారు పారిపోకుండా ఇంట్లోనే ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. కాగా, సోహైల్‌ను రాత్రి పదిన్నర గంటలకు అరెస్ట్ చేయగా, కరీముద్దీన్, హఫీజుర్‌ను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. 


సోహైల్, హఫీజుర్ హైదరాబాద్‌లో, కరీముద్దీన్ గుజరాత్‌లో పనిచేసేవారు. హైదరాబాద్‌కు రావాల్సి ఉండడంతో తన మేనల్లుడు జునైద్ ఢిల్లీ వెళ్లాడని అతడి  మామ పేర్కొన్నారు. జునైద్ తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు ఫిలిబిత్‌లో జునైద్‌ను అరెస్ట్ చేశారు. తన కుమారుడు అమాయకుడని, స్నేహితులతో కలిసి సరుకులు కొనేందుకు వెళ్లాడని జునైద్ తండ్రి ఇజ్రాయెల్ పేర్కొన్నారు. 

Read more