హిజాబ్‌ హీట్‌!

ABN , First Publish Date - 2022-09-26T08:10:57+05:30 IST

హిజాబ్‌ నిబంధనలపై ఇరాన్‌ సర్కారు కఠినంగా వ్యవహరిస్తున్న తీరుతో ఆ దేశ మహిళల్లో ఆగ్రహావేశాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

హిజాబ్‌ హీట్‌!

1979 నుంచి మహిళలపై నిబంధనల కత్తి

నాలుగు దశాబ్దాలుగా ప్రతిఘటిస్తూనే ఉన్న అతివలు

హిజాబ్‌ నిబంధనలపై ఇరాన్‌ సర్కారు కఠినంగా వ్యవహరిస్తున్న తీరుతో ఆ దేశ మహిళల్లో ఆగ్రహావేశాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నిజానికి 1979లో ఆయతుల్లా ఖొమేనీ ఇస్లామిక్‌ ప్రతిఘటన ఉద్యమం ద్వారా ఇరాన్‌పై పట్టు సాధించినప్పటి నుంచీ ఆ దేశంలో మహిళల వస్త్రధారణపై ఆంక్షలున్నాయి. వాటిని చాలా మంది మహిళా న్యాయవాదులు, విద్యార్థినులు, ఇతర వృత్తులవారు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘తిరోగమించడానికి కాదు మనం విప్లవం చేసింది’’ అంటూ ఖొమేనీ విధానాలను నిరసించేవారు. కానీ, ఖొమేనీ, ఆయన మద్దతుదారులు వారి నిరసనలను పెద్దగా పట్టించుకోలేదు సరికదా.. బహిరంగ ప్రదేశాల్లో తమ జుత్తును హిజాబ్‌తో కప్పి ఉంచని మహిళలకు 74 కొరడా దెబ్బల శిక్ష విధించాలని 1983లో ఇరాన్‌ పార్లమెంటు నిర్ణయించింది. 1995 నాటికి ఆ ఆంక్షలు మరింత కఠినతరం చేసి హిజాబ్‌ ధరించని మహిళలకు రెణ్నెల్ల జైలు శిక్ష విధించే విధానం అమల్లోకి వచ్చింది. అలా నాలుగు దశాబ్దాలకు పైగా ఇరాన్‌ మహిళలు ఈ నిబంధనలపై నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. గత ఏడాది.. విదా మొవాహెద్‌ అనే 31 ఏళ్ల మహిళ టెహ్రాన్‌లోని ఎంఘెలాబ్‌ (విప్లవం) వీధిలో తన హిజాబ్‌ తీసేసి, దానిని ఒక కర్రకు తగిలించి ఊపుతూ నిరసన తెలిపింది. మొరాలిటీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ ఉదంతం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.


అంతేకాదు.. ‘గర్ల్‌ ఆఫ్‌ ఎంఘెలాబ్‌ స్ట్రీట్‌’గా పేరొందిన ఆ మహిళ స్ఫూర్తితో ఇరాన్‌ మహిళలు తమ హిజాబ్‌లు తీసేసి కర్రలకు తగిలించి ఊపుతూ తమ అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేయసాగారు. ఈ ఏడాది జనవరి 30న నర్గిస్‌ హుస్సేనీ అనే మరో మహిళ ఇదే తరహాలో నిరసన తెలుపగా.. పోలీసులు ఆమెను అరెస్టు చేసి అనంతరం బెయిలుపై విడుదల చేశారు. కానీ, అలాంటివారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టింది.  దేశవ్యాప్తంగా.. వస్త్రధారణ నియమాలు పాటించని 1700 మంది మహిళలకు సమన్లు జారీ చేశారు. పాశ్చాత్యుల శైలిలో వస్త్రాలు ధరించి, జుత్తును కట్‌ చేయించుకున్న రష్నో అనే రచయిత్రిని కస్టడీలోకి తీసుకుని.. నాలుగు రోజుల తర్వాత ఆమెతో హిజాబ్‌ ధరింపజేసి, జాతీయ టెలివిజన్‌లో కన్ఫెషన్‌ (చేసిన తప్పును ఒప్పుకోవడం) చెప్పించారు. ఈ నిర్బంధానికి పరాకాష్టగా.. హిజాబ్‌, వస్త్రధారణ నిబంధనలు పాటించనివారికి శిక్షలు సైతం విధించేలా గత నెల 15న ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఒక డిక్రీ జారీ చేశారు. ఆ ఉత్తర్వు ప్రకారం.. ఇరాన్‌ మహిళలు సోషల్‌ మీడియాలో పెట్టే తమ ఫొటోల్లో హిజాబ్‌, వస్త్రధారణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.


లేనివారికి జరిమానా విధించే హక్కు, వారికి సహజంగా లభించే సామాజికహక్కులను ఆర్నెల్ల నుంచి ఏడాదిపాటు అందకుండా చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఈ డిక్రీపై ఇరాన్‌లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న దశలో.. హిజాబ్‌ సరిగ్గా ధరించలేదంటూ మహ్సా అమిని అనే యువతిని మొరాలిటీ పోలీసులు (హిజాబ్‌, వస్త్రధారణ నిబంధనలు పాటించనివారిని హెచ్చరించే నైతిక పోలీసులు) అరెస్టు చేయడం, వారి కస్టడీలో ఆమె మరణించడంతో ఇరాన్‌ గత కొద్దిరోజులుగా ప్రజా నిరసనలతో అట్టుడుకిపోతోంది. ఈ నిరసనలను భద్రతా దళాలు ఉక్కుపాదంతో అణచివేయడానికి చేస్తున్నప్రయత్నాల్లో 26 మంది దాకా చనిపోయారు. 


రాజకీయ కోణం..

ప్రస్తుతం ఇరాన్‌ అధిక ద్రవ్యోల్బణం, పెద్దఎత్తున విధించిన అంతర్జాతీయ ఆంక్షలతో తీవ్రంగా సతమతమవుతోంది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు.. నీటి సంక్షోభం, స్థానిక ఉద్రిక్తతలు ఆ సమస్యలకు తోడయ్యాయి. దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఈ ఆగ్రహం దేశవ్యాప్తంగా హింసాత్మక ప్రదర్శనలకు దారితీస్తోంది. తన పదవిని కాపాడుకోవాలంటే మతఛాందసవాదుల అండ ఇరాన్‌ అధ్యక్షుడు రైసీకి కావాలని.. అందుకే మహిళలపై మొరాలిటీ పోలీసులను ప్రయోగిస్తూ వారి కరుణాకటాక్షాల కోసం ప్రయత్నిస్తున్నారు.     

     - సెంట్రల్‌ డెస్క్‌


‘‘ఈ (1979 నాటి ఇస్లామిక్‌) విప్లవానికి సహకరించింది మంచి దుస్తులు ధరించిన, అణకువగలిగిన మహిళలే. మేకప్‌ ధరించి, తమ మెడ, జుత్తు, దేహభాగాలను ప్రదర్శించే వగలాడి మహిళలు షా (మహ్మద్‌ రెజా పహ్లావీ)పై పోరాడలేదు. సమాజానికి ఉపయోగపడేలా ఎలా ఉండాలో వారికి ఎంతమాత్రం తెలియదు. తమను తాము ప్రదర్శించుకోవడం ద్వారా వారు ప్రజల కోపానికి గురయ్యారు’’- 1979లో ఇటలీకి చెందిన మహిళా పాత్రికేయురాలు ఒరియానా ఫెల్లాసీతో ఆయతుల్లా ఖొమేనీ చేసిన వ్యాఖ్యలివి.దేశంలో 49% వ్యతిరేకమే..

సన్‌ రౌహానీ ఇరాన్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక సర్వే నిర్వహించారు. అందులో పాల్గొన్న ప్రజల్లో దాదాపు సగం మంది పైగా.. హిజాబ్‌ధారణ వ్యక్తిగత అంశంగా మాత్రమే ఉండాలి తప్ప, బలవంతంగా రుద్దకూడదని తేల్చిచెప్పారు. మూడేళ్లపాటు నిర్వహించిన ఈ సర్వే వివరాలను రౌహానీ ప్రభుత్వమే ప్రచురించింది. 2006లో ఇదే తరహా సర్వే చేపడితే మహిళలు ఏం ధరించాలో చెప్పే హక్కు ప్రభుత్వానికి లేదని 34ు మంది అభిప్రాయపడ్డారు. 2014 నాటికి వారి సంఖ్య 49 శాతానికి చేరడం గమనార్హం. 


దేశాలు.. నిబంధనలు

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు హిజాబ్‌ను, శరీరాన్ని పూర్తిగా కప్పుకొనే తరహా వస్త్రధారణను తిరోగామి ధోరణిగా భావించి నిషేధం విధించాయి. ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌, బల్గేరియా, బెల్జియం, ఆస్ట్రియా దేశాలు హిజాబ్‌ను నిషేధించాయి. కొన్ని ముస్లిం దేశాల్లో సైతం ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే ముసుగులపై నిషేధం ఉంది. ఈ తరహా నిషేధం అల్జీరియా, బోస్నియా, హెర్జెగోవ్నియా, కజక్‌స్థాన్‌, సిరియా, తజికిస్థాన్‌, ట్యునీసియా దేశాల్లో ఉంది. ఆఫ్రికాలో కామెరూన్‌, చాద్‌, కాంగో బుర్ఖాపై నిషేధం విధించాయి. బుర్ఖాల్లో వచ్చి ఉగ్రవాద దాడులకు పాల్పడుతుండడంతో ఆయా దేశాలు ఈ నిషేఽధ నిర్ణయాన్ని తీసుకున్నాయి. సౌదీఅరేబియా నిబంధనల ప్రకారం మహిళలు గౌరవప్రదంగా దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఆసియాలో.. చైనా, శ్రీలంక భద్రతా కారణాల రీత్యా బుర్ఖాపై నిషేధం విధించాయి. ఇరాన్‌, అఫ్ఘానిస్థాన్‌ వంటి దేశాల్లో మాత్రం బుర్ఖా, హిజాబ్‌ తప్పనిసరి. అమెరికా, కెనడా, యూకేలు తటస్థ విధానాన్ని పాటిస్తున్నాయి. 


అమినీ మరణ వార్తను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్ట్‌ అరెస్ట్‌


టెహ్రాన్‌, సెప్టెంబరు 25: మహ్స అమినీ మరణ వార్తను ప్రపంచానికి తెలియజెప్పిన మహిళా జర్నలిస్ట్‌ నిలూఫర్‌ హమేదీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది మహమ్మద్‌ అలీ కమ్‌ఫిరౌజీ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. హమేదీ ఇంటిపై పోలీసులు దాడి చేశారని, ఆమెను అరెస్ట్‌ చేయడంతో పాటు ఆమె వస్తువులను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. హమేదీ ట్విట్టర్‌ ఖాతా కూడా సస్పెండ్‌ అయింది. హమేదీ షర్గ్‌ అనే వార్తా పత్రికలో పనిచేస్తున్నారు. హమేదీకి ముందు యల్డా మొయిరీ అనే మహిళా ఫొటో జర్నలి్‌స్టను కూడా అరెస్ట్‌ చేశారు. 

Read more