High alert: కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో హై అలర్ట్..!

ABN , First Publish Date - 2022-11-30T12:13:34+05:30 IST

కర్ణాటక - మహారాష్ట్ర(Karnataka - Maharashtra) సరిహద్దుల్లో బెళగావి ప్రధాన కేంద్రంగా నలుగుతున్న వివాదం సుప్రీం కోర్టులో బుధవారం

High alert: కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో హై అలర్ట్..!

- భారీ స్థాయిలో మోహరించిన పోలీసులు

- ఇలాగైతే మహారాష్ట్ర ప్రాంతాలను అడగాల్సి వస్తుంది

- ఢిల్లీలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై

- నేడు సుప్రీం కోర్టులో విచారణ

బెంగళూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక - మహారాష్ట్ర(Karnataka - Maharashtra) సరిహద్దుల్లో బెళగావి ప్రధాన కేంద్రంగా నలుగుతున్న వివాదం సుప్రీం కోర్టులో బుధవారం విచారణకు రానుంది. 2004లో మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకలోని బెళగావి, కారవార, బీదర్‌లోని 865 పట్టణాలు, గ్రామాలు తమకే చెందాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన సంగతి విదితమే. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించాలా..? వద్దా..? అనే అంశంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకోనుండడంతో రెండు రాష్ట్రాల మధ్య హై టెన్షన్‌(High tension) నెలకొంది. మహారాష్ట్రకు చెందిన పలు సంఘాలు కర్ణాటక బస్సులకు మసి పూసి దాడులకు పాల్పడిన నేపథ్యంలో సరిహద్దులో హై అలర్ట్‌ ప్రకటించారు. హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర, డీజీపీ ప్రవీణ్‌సూద్‌ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఈ కేసును వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రొహటగితోనూ, న్యాయనిపుణులతోనూ రెండు గంటలకుపైగా సుదీర్ఘ చర్చలు జరిపారు. కేసును సమర్థవంతంగా వాదించాలని, అందుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. సరిహద్దు వివాదానికి సంబంధించి మహాజన్‌ కమిషన్‌ గతంలో సమర్పించిన నివేదిక అంతిమమని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ మహారాష్ట్ర సరిహద్దు పేచీ లేవనెత్తడాన్ని కర్ణాటక జీర్ణించుకోలేకపోతోంది. పైగా ఎన్నికల సంవత్సరం కానుండడంతో ప్రతిపక్షాలకు కొత్త అస్త్రం దక్కకుండా ఉండేందుకు ఈ కేసును గెలిచి తీరాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఒకవేళ కేసు తీర్పు రాష్ట్రానికి అనుకూలంగా వస్తే 2023 శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి మరో ప్లస్‌పాయింట్‌ అవుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ కేసును సీరియ్‌సగా తీసుకున్న ముఖ్యమంత్రి ఏకంగా ఢిల్లీకి చేరుకుని స్వయంగా పర్యవేక్షణ చేపట్టడం విశేషం.

రివర్స్‌ గేర్‌లో కర్ణాటక

సరిహద్దు వివాదాన్ని మహారాష్ట్ర అస్త్రంగా మార్చుకుని పదే పదే చికాకులు సృష్టిస్తుండడంతో కర్ణాటక సరికొత్త వ్యూహానికి సిద్ధమైంది. ఇంతకాలం మహారాష్ట్ర మాత్రమే కర్ణాటక ప్రాంతాలు తమవని వాదిస్తూ రాగా ఇప్పుడు కర్ణాటక కూడా అదే బాట పట్టింది. మహారాష్ట్రలో పెద్దసంఖ్యలో కన్నడిగులు నివసిస్తున్న అక్కలకోటె, పండరీపుర, జాతా తదితర ఐదారు ప్రాంతాలు న్యాయబద్ధంగా కర్ణాటకలో చేరి ఉండాల్సిందని వాదిస్తోంది. భాషా ప్రాతిపదకన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు జనాభా ప్రాతిపదకన మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆయా రాష్ట్రాల్లో కలిపారని ప్రభుత్వం పేర్కొంటోంది. కన్నడిగులు అత్యధికంగా నివసించే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ(Andhra Pradesh, Maharashtra, Kerala)లో ఉన్నాయని వాటి గురించి తాము ఏనాడూ పేచీ లేవనెత్తలేదని కర్ణాటక అంటోంది. ఇప్పుడు తాజాగా మహాజన్‌ నివేదిక కమిషన్‌ అంతిమమని స్వయంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పినా మళ్లీ మళ్లీ వివాదం లేవనెత్తుతుండడంతో మహారాష్ట్రలోని ప్రాంతాల విషయంలో తాము కూడా అదేబాట పట్టాల్సి వస్తోందని హెచ్చరిస్తోంది. ఒకవేళ సుప్రీంకోర్టు బుధవారం ఈ కేసును విచారణకు స్వీకరిస్తే ఉభయరాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కొత్తరూపం సంతరించుకోవడం ఖాయమని అంటున్నారు.

కరవే హెచ్చరికతో భారీ బందోబస్తు

బెళగావిలోని అమాయకులైన మరాఠీలను కన్నడిగులపై రెచ్చగొట్టేలా తద్వారా భాషా వైషమ్యాలను పెంచేలా మహారాష్ట్ర మంత్రులిద్దరు బెళగావికి వస్తుండడాన్ని కర్ణాటక రక్షణా వేదిక సహా పలు కన్నడ సంఘాలు తప్పుబట్టాయి. మహారాష్ట్ర మంత్రులు బెళగావిలో జరిపే సభలను ముట్టడించి అడ్డుకుంటామని కరవే అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ మంగళవారం ప్రకటించారు. సరిహద్దు వివాదం విషయంలో కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ బెంగళూరులో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సరిహద్దు వివాదంలో కర్ణాటకకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని, పరస్పర చర్చలతో సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నా ఇంతకాలం నిర్లక్ష్యం వహించారంటూ మండిపడ్డారు. సుప్రీంకోర్టులో బుధవారం సరిహద్దు వివాదంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

మహారాష్ట్ర ప్రయాణికులకు గులాబీ ఇచ్చిన ఏడీజీపీ అలోక్‌ కుమార్‌

కర్ణాటక-మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కర్ణాటక పోలీసులు గట్టి పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బెళగావి జిల్లా పరిధిలోని నిప్పాణి, కుగనొళ్లి చెక్‌పోస్టులను ఏడీజీపీ అలోక్‌ కుమార్‌ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సరిహద్దు ప్రాంతాల్లో అధికారులతో పరిశీలించిన అలోక్‌ కుమార్‌ మహారాష్ట్ర నుంచి బస్సు, కారు, లారీల ద్వారా వచ్చే ప్రయాణికులకు సరిహద్దులో గులాబీ పు వ్వు ఇచ్చి స్వాగతం పలికారు. మహారాష్ట్రకు చెందిన కొంతమంది అల్లరి మూకలు కర్ణాటక బస్సులకు మసిపూయడంతో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి విదితమే.

Updated Date - 2022-11-30T12:13:37+05:30 IST