Pakistanలో వెల్లువెత్తిన వరదలు...57 మంది మృతి

ABN , First Publish Date - 2022-07-11T18:09:53+05:30 IST

పాకిస్థాన్‌ దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది....

Pakistanలో వెల్లువెత్తిన వరదలు...57 మంది మృతి

కరాచీ(పాకిస్థాన్): పాకిస్థాన్‌ దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది.బలూచిస్థాన్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల మహిళలు, పిల్లలతో సహా 57 మంది మరణించినట్లు పాక్ అధికారులు తెలిపారు.పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలలో కుండపోత వర్షంతో పలువురు మరణించారు.వరదల వల్ల వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. పాకిస్థాన్ దేశంలోని అతిపెద్ద నగరమైన కరాచీలో గత కొన్ని రోజులుగా వీధులు జలమయం అయ్యాయి. బలూచిస్థాన్‌లో వర్షాలు తీవ్ర వినాశనానికి కారణమయ్యాయి.బలూచిస్తాన్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లో వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఎనిమిది ఆనకట్టలు తెగిపోయాయి. ఈ వరదల ధాటికి 57 మంది మరణించారని ప్రావిన్స్ ముఖ్యమంత్రి విపత్తు, హోం వ్యవహారాల సలహాదారు జియావుల్లా లాంగోవ్ తెలిపారు.


బలూచిస్తాన్ నగరంలోని ఖయ్యూమాబాద్ చౌరంగి, అక్తర్ కాలనీ, డిఫెన్స్ మోర్ వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని స్థానిక అధికారులు చెప్పారు. కోరంగి రోడ్డు, పీఐడీసీ సిగ్నల్ చౌక్‌లో రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు రెండడుగుల లోతు నీటిలో ప్రయాణించాల్సి వచ్చింది. వరదనీటితో రోడ్లు, అండర్‌పాస్‌లను కూడా మూసివేశారు.పాకిస్తాన్‌ దేశంలోని వర్షాలకు దెబ్బతిన్న నగరాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యాయి.కరాచీలో వర్షంతో పాటు ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి.కరాచీ దక్షిణ ప్రాంతాల్లోని డిఫెన్స్, క్లిఫ్టన్, సద్దర్, కెమారి, కోరంగి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. 


 భారీ వర్షాల కారణంగా కరాచీ నుంచి హైదరాబాద్ రోడ్డు మునిగిపోయింది. వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.ఇల్లు కూలిన ఘటనలో మరో నలుగురు గాయపడినట్లు జిల్లా అధికారి ఒకరు తెలిపారు.




Updated Date - 2022-07-11T18:09:53+05:30 IST