Big Shock To Congress: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్!

ABN , First Publish Date - 2022-09-28T22:16:51+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

Big Shock To Congress: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్!

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష్ మహాజన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. హర్ష్ మహాజన్ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ సీఎం వీరభద్రసింగ్‌కు ప్రధాన అనుచరుడు కూడా. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సమక్షంలో బీజేపీలో చరిన హర్ష్ మహాజన్ ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాతో సమావేశమయ్యారు. 





కాంగ్రెస్ పార్టీకి సరైన దిశానిర్దేశం లేదని, హిమాచల్ ప్రదేశ్‌లో హస్తం పార్టీకి సరైన నాయకుడే లేడని హర్ష్ మహాజన్ విమర్శించారు. రాహుల్ గాంధీ కారణంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు.


ఓ పక్క భారత్ జోడో అంటూ రాహుల్ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆ పార్టీకి బైబై చెబుతున్నారు. ఇటీవలే గోవాలో 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేదు అనుభవాన్ని మిగుల్చుతున్నాయి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ సహా అగ్రనాయకత్వం కలలు కంటుంటే కీలక నేతలంతా హస్తం పార్టీని వీడిపోతున్నారు.


రాజస్థాన్‌లోనూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గీయుల మధ్య కుమ్ములాటలు పార్టీని నవ్వులపాలు చేస్తున్నాయి. రాజస్థాన్ వివాదం ఇంకా ముగియక ముందే హిమాచల్ ప్రదేశ్‌లో హర్ష్ మహాజన్ పార్టీని వీడటం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. 


హిమాచల్ ప్రదేశ్‌లో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ సీఎం జై రామ్ ఠాకూర్ నేతృత్వంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ పార్టీకి హర్ష్ మహాజన్ ఇచ్చిన షాక్ తేరుకోలేకుండా చేస్తోంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా హిమాచల్ ప్రదేశ్‌లో ప్రచారం ఉధృతంగా సాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2022-09-28T22:16:51+05:30 IST