బీజేపీ.. రాష్ట్రపతి అభ్యర్థి గులాంనబీ ఆజాద్‌?

ABN , First Publish Date - 2022-03-04T07:56:22+05:30 IST

ఇప్పటికే నిర్ణయించిన మోదీ!.. ఆయనైతేనే ఇతర పార్టీల మద్దతు సులభం.. కాంగ్రెస్‌ కూడా వ్యతిరేకించే చాన్స్‌..

బీజేపీ.. రాష్ట్రపతి అభ్యర్థి గులాంనబీ ఆజాద్‌?

ఇప్పటికే నిర్ణయించిన మోదీ!.. ఆయనైతేనే ఇతర పార్టీల మద్దతు సులభం.. కాంగ్రెస్‌ కూడా వ్యతిరేకించే చాన్స్‌ లేదుముస్లిం వ్యతిరేక ముద్ర పోగొట్టుకోవచ్చు.. ఏకాభిప్రాయ ఖ్యాతి పొందొచ్చు.. భిన్న ప్రయోజనాల బేరీజులో బీజేపీ పలు పార్టీల నేతలతో ఆజాద్‌ చర్చలు మొదలు.. ఏపీ మంత్రిని పిలిపించుకొని మద్దతు అభ్యర్థన ఉత్తరప్రదేశ్‌ ఫలితాలు, మారిన పరిణామాలే కీలకం.. ఆజాద్‌ బరిలో ఉంటే ప్రతిపక్షాల్లో చీలిక ఖాయం


న్యూఢిల్లీ, మార్చి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఎన్నికకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ను అభ్యర్థిగా రంగంలోకి దించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆజాద్‌ ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో చర్చలు ప్రారంభించారని తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో ఉన్న ఒక సీనియర్‌ నేతను ఇటీవల ఆజాద్‌ ఢిల్లీ పిలిపించుకుని ఈ విషయమై మాట్లాడినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతిచ్చే విషయమై జగన్‌ను ఒప్పించాల్సిందిగా కోరినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, వచ్చే జూలైలో జరుగనున్న ఈ ఎన్నికలో ముస్లిం నేతను అభ్యర్థిగా పెట్టడంద్వారా బీజేపీపై ఉన్న ముస్లిం వ్యతిరేక ముద్రను తొలగించుకోవడంతో పా టు రాజ్యాంగపరంగా అత్యున్నత పదవి విషయంలో ఏకాభిప్రాయాన్ని సాఽ దించిన ఖ్యాతి దక్కుతుందని మోదీ భావిస్తున్నారు.


మరోవైపు బీజేపీ తమ అ భ్యర్థిని నిలిపితే ఇతర పార్టీల మద్దతు లేకుండా గెలిచే అవకాశాల్లేవు. ఈ నేపథ్యంలో ఆజాద్‌ అయితే మిగతా పార్టీలు మద్దతిస్తాయని, తమ నేత కాబట్టి కాంగ్రెస్‌ వ్యతిరేకించే అవకాశం ఉండదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. 72 సంవత్సరాల ఆజాద్‌ గత ఏడాది ఏప్రిల్‌ వరకు రాజ్యసభా నేతగా ఉన్నారు. వరుస పరాజయాలు, నాయకత్వ లేమి,సంస్థాగత మార్పులు లేకపోవడం పట్ల అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కీలక నేతల బృందానికి గులాంనబీ నాయకుడిగా వ్యవహరించారు. కాగా, రాజ్యసభలో ఉన్నప్పుడు మోదీ ఆయనతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు. ఆజాద్‌ రాజ్యసభ నేతగా పదవీ విరమణ చేసినప్పుడు మోదీ తన అనుబంధాన్ని తలుచుకుని కంటతడిపెట్టిన విషయం తెలిసిందే.


దీనికితోడు ఈ ఏడాది ఆజాద్‌కు అత్యున్నతమైన పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ పరిణామాలను బట్టి ఆయనను రాష్ట్రపతిగా ఎంపిక చేసేందుకు బీజేపీ ఎంతో ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసిందని తెలుస్తోంది. 

యూపీ ఫలితాలు, పరిణామాలు కీలకం

రాష్ట్రపతి ఎన్నిక ప్రాతినిధ్య నిష్పత్తి ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లతో జరుగుతుంది. ఒక ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహించే జనాభా ప్రకారం ఆయన ఓటు విలువ నిర్ణయమవుతుంది. అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌ లో ఎమ్మెల్యే ఓటు విలువ 208 అయితే ఎంపీ ఓటు విలువ 708. ఎలక్టోరల్‌ కాలేజీలో సగం ఓట్లు సాధించాలన్నా రాష్ట్రపతిగా ఎంపికయ్యే అభ్యర్థికి 5,49,452 ఓట్లు రావాలి. ప్రస్తుతం బీజేపీకి 4,74,102 ఓట్లు మాత్రమే ఉన్నాయి. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ కు 7,02,044 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష అభ్యర్థి మీరాకుమార్‌కు 3,67,314 ఓట్లు లభించాయి. కాగా, అప్పట్లో అన్నాడీఎంకె, జేడీ(యూ), బీజేడీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ, వైసీపీ, శివసేన, అకాలీదళ్‌ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు కోవింద్‌కు మద్దతిచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలోని మొత్తం 403 సీట్లలో బీజేపీ, మిత్రపక్షాలు 312 సీట్లు గెలుచుకున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోనే కోవింద్‌కు 63,440 ఓట్లు లభించాయి.


ఇక 2017లో పంజాబ్‌లో అకాలీదళ్‌, మహారాష్ట్రలో శివసేన, తమిళనాడులో అన్నాడీఎంకే అండగా నిలిచాయి. ఇప్పుడు అకాలీ, శివసేన దూరమయ్యాయి. అన్నాడీఎంకే బదులు డీఎంకే అధికారంలోకి వచ్చింది. అంటే.. యూపీ ఎన్నికల్లో బీజేపీ సంఖ్యాబలం ఎంత తగ్గితే రాష్ట్రపతిగా ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికకు అంత ఇబ్బంది వస్తుంది. కాగా, యూపీలో దెబ్బతింటే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతునిచ్చేందుకు పార్టీలు ముందుకురావు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆపార్టీ ప్రతిపక్షాల మద్దతు పొందేందుకు పావులు కదుపుతోంది.


ప్రతిపక్షాల అడుగులెటు?

ప్రతిపక్ష శిబిరం కూడా రాష్ట్రపతి అభ్యర్థి విషయమై మంతనాలు సాగిస్తోంది. అయితే, ఆజాద్‌ను కనుక బీజేపీ రంగంలోకి దించితే ప్రతిపక్ష శిబిరం చీలిపోతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆజాద్‌ లౌకిక భావాలు, చిరకాల అనుబంధం రీత్యా ఆయనకు కొన్ని పార్టీలు  మద్దతునిస్తాయని వివరిస్తున్నాయి. ఎన్డీఏ నుంచి బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ (యూ) నేత నితీశ్‌ కుమార్‌ బయటకు వస్తే రాష్ట్రపతి  అభ్యర్థిగా నిలబెట్టే విషయం యోచిస్తామని ఎన్సీపీ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఇటీవల అన్నారు. అయితే, నితీశ్‌ దీనిని ఖండించారు. కొన్ని రోజుల కిందట మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిసిన సందర్భంలో పలు సమీకరణాలతో పాటు రాష్ట్రపతి ఎన్నిక ప్రస్తావన వచ్చిందని రాజకీయ వర్గాలు తెలిపాయి. మొత్తానికి యూపీ ఫలితాల తర్వాత.. ఢిల్లీలో ప్రతిపక్ష రాష్ట్రాల సీఎంల భేటీ సమయంలో స్పష్టత వస్తుందని అంటున్నాయి. కాంగ్రెస్‌ సహా బీజేపీయేతర అన్ని పార్టీలు.. ఉమ్మడి అభ్యర్థిని నిలిపితే బీజేపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. లేదా బీజేపీనే ప్రతిపక్షాలతో చర్చించి ఉమ్మడి అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదని అంటున్నాయి.

Read more