Gujarat Himachal elections: ఈ సారి పోరు మామూలుగా ఉండదు!

ABN , First Publish Date - 2022-10-03T21:58:58+05:30 IST

న్యూఢిల్లీ: అతి త్వరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

Gujarat Himachal elections: ఈ సారి పోరు మామూలుగా ఉండదు!

న్యూఢిల్లీ: అతి త్వరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రెండు చోట్లా మరోసారి కమలం వికసిస్తుందని ఒపినీయన్ పోల్స్ చెబుతున్నాయి. ఏబీపీ న్యూస్‌-సీఓటర్‌ ఒపీనియన్‌ పోల్‌ ప్రకారం బీజేపీ గుజరాత్‌లో ఏడోసారి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. గుజరాత్‌ అసెంబ్లీకి ఉన్న 182 సీట్లలో గత ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు రాగా... ఈసారి 135 నుంచి 143 వరకు సీట్లు రావొచ్చని పోల్‌ పేర్కొంది. కాంగ్రెస్‌కు 36 నుంచి 44 వరకు సీట్లు దక్కవచ్చని ఒపీనియన్ పోల్ అంచనావేసింది. అలాగే 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 37-45 సీట్లలో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్ తెలిపింది. 


గుజరాత్‌లో అహ్మద్ పటేల్ మరణంతో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీనికి తోడు గుజరాత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్ధిక్ పటేల్ బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్‌కు దెబ్బమీదదెబ్బ తగిలింది. పార్టీకి సమర్థ నాయకుడెవరూ లేకపోవడం హస్తం పార్టీ నేతలను కలవరపెడుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన సవాల్‌గా మారింది. ఇప్పటికే ఆరుసార్లు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బెడద కాస్త ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీలు చీల్చనున్నాయి. ఇది కూడా కమలనాథులకు కలిసి వస్తోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా నుంచి అధికారంలోకి రావాల్సిన కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం మైనస్ పాయింట్‌గా మారింది. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో ఆదరణ పెరుగుతోంది. ఊహించనంత మద్దతు లభిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. 


కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను జాగ్రత్తగా గమనిస్తోన్న గుజరాత్ బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టుల జోరు పెంచింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రంలో పర్యటనలు జరుపుతూ క్యాడర్‌ను ఉత్సాహపరుస్తున్నారు. గెలిచి తీరాలని చెబుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ల ప్రాధాన్యతను వివరిస్తున్నారు. 2024 ముందు మోదీ, షా, నడ్డా త్రయానికి గుజరాత్ ఎన్నికలు లిట్మస్ టెస్ట్‌లా మారాయి. 


భారత్ జోడో యాత్ర ద్వారా కేంద్రంలోని మోదీ సర్కారుకు సమరభేరీ మోగించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్‌లోనూ పాదయాత్ర కొనసాగించనున్నారు. తన పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేసుకుని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును తన వైపునకు తిప్పుకోగలిగితే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా నిలబడుతుంది. రాహుల్ పాదయాత్ర గుజరాత్‌లో తప్పకుండా ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అదే జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి బదులుగా కాంగ్రెస్ బీజేపీకి గట్టి సవాలు విసరగలుగుతుంది. రాహుల్ పాదయాత్ర కనుక గుజరాత్‌లో ప్రభావం చూపించకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు సహజంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి పడుతుంది. ఈ పరిణామాలు ఇప్పటికిప్పుడు మేలు చేకూర్చకపోయినా గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నిలదొక్కుకోవడానికి దోహదపడతాయి. రాహుల్ పాదయాత్ర గుజరాత్‌లో ప్రభావం చూపించకపోతే 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ కన్నా ఆమ్ ఆద్మీ పార్టీయే బీజేపీకి ప్రత్యర్థిగా మారుతుంది. 


ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ మరోసారి అధికారంలోకి వస్తారని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 37-45 సీట్లలో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని ఏబీపీ న్యూస్‌-సీఓటర్‌ ఒపీనియన్‌ పోల్‌ తెలిపింది. ఒపీనియన్ పోల్స్ చెప్పేది ఎలా ఉన్నా బీజేపీ నాయకత్వం గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న హర్ష్ మహాజన్ ఇటీవలే బీజేపీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీలో చేరబోతున్నారు. ఆసక్తికరమైన విషయమేంటంటే హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకొస్తోంది. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ కూడా సవాలుగా మారుతోంది. బీజేపీకి ఆప్ ఇప్పటికిప్పుడు చెక్ పెట్టకపోయినా కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించడం ద్వారా క్రమంగా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకునే అవకాశం ఉంది.

           

రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఎన్నికలను పరీక్ష కిందే భావిస్తాయి. దీనికి తోడు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందుగా జరుగుతుండటంతో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒపీనియన్ పోల్స్ నిజమౌతాయా లేదా అనేది త్వరలోనే తేలనుంది. 

Read more