Gujarat Assembly Elections: గుజరాత్ భేరి!
ABN, First Publish Date - 2022-11-04T04:22:11+05:30
: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 1, 5 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. వచ్చే నెల 8న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ వెల్లడించారు. గురువారమిక్కడ ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, ఇతర సీనియర్ అధికారులతో కలిసి పోలింగ్ వివరాలు తెలియజేశారు.
రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు
డిసెంబరు 1న 89 స్థానాలకు,
5వ తేదీన 93 సీట్లకు పోలింగ్
8న ఓట్ల లెక్కింపు.. ఫలితాలు
రేపట్నుంచే తొలి విడత నామినేషన్లు
10న రెండో విడతకు నోటిఫికేషన్
మొత్తం ఓటర్లు 4.9 కోట్ల మంది
51,782 పోలింగ్ బూత్‌ల ఏర్పాటు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన
షెడ్యూల్ విడుదలలో జాప్యం లేదు
100ు నిష్పక్షపాతంగా ఉన్నాం
సీఈసీ వెల్లడి
బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్యే పోటీ!
న్యూఢిల్లీ, నవంబరు 3: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 1, 5 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. వచ్చే నెల 8న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ వెల్లడించారు. గురువారమిక్కడ ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, ఇతర సీనియర్ అధికారులతో కలిసి పోలింగ్ వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలున్నాయని.. వీటిలో మొదటివిడతలో 89 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. మిగతా 93 స్థానాలకు 5న పోలింగ్ జరుగుతుంది. డిసెంబరు 8న మరో రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌తో కలిపి గుజరాత్ ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. తొలి విడత సీట్లకు 5న (శనివారం), రెండో విడతకు 10న నోటిఫికేషన్ జారీ అవుతుంది.
పక్షపాతం లేనే లేదు..
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ గత నెల 14న ప్రకటించిన సంగతి తెలిసిందే. దానితోపాటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలనూ ప్రకటించకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలు, ప్రారంభోత్సవాలకు వీలుగానే ఎన్నికల తేదీలు ప్రకటించలేదని ఆరోపించాయి. ఈ ఆరోపణలను ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ గురువారం తోసిపుచ్చారు. నూరు శాతం నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల తేదీల ఖరారుకు.. వాతావరణం, అసెంబ్లీ పదవీకాలం గడవు, ప్రవర్తనా నియమావళి ఎన్ని రోజులు అమల్లో ఉండాలి.. తదితర అంశాలను బేరీజు వేసి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని చెప్పారు. ‘గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 వరకు ఉంది. అంటే ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు ఓట్ల లెక్కింపు తేదీ (డిసెంబరు 8)కి, అసెంబ్లీ పదవీకాలం పూర్తి కావడానికి నడుమ 72 రోజులు ఉంది. 110 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాం’ అని తెలిపారు. నిజానికి రెండ్రోజుల కిందటే షెడ్యూల్ విడుదల చేయాలని భావించామని.. కానీ మోర్బీలో తీగల వంతెన కూలిన విషాద ఘటన కారణంగా ఆపామని చెప్పారు.
షిప్పింగ్ కంటైనర్‌లో పోలింగ్ బూత్
గుజరాత్ సముద్రంలోని ఓ దీవిలో ఉన్న 200 మంది ఓటర్ల కోసం షిప్పింగ్ కంటైనర్‌లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు రాజీవ్‌కుమార్ తెలిపారు. వాగ్రా నియోజకవర్గం పరిధిలో అలియాభట్ గ్రామంలో వీరు ఓటేయాల్సివుండగా, అక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలేవీ లేక ఈ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే షియాల్‌బెట్ దీవికి ప్రధాన భూభాగంతో సరైన రవాణా కనెక్టివిటీ లేనందున పోలింగ్ సిబ్బందే అక్కడకు బోటులో వెళ్తారని చెప్పారు. గిర్ అడవుల్లో బహరత్‌దా్‌స దర్శన్‌దాస్ అనే ఒకే ఒక్క ఓటరు ఉన్నారని.. ఆయన కోసం బనేజ్ వద్ద పోలింగ్ కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. తూర్పు ఆఫ్రికా నుంచి వలస వచ్చి స్థిరపడిన సిద్దీ తెగవారి కోసం గిర్ సోమ్‌నాథ్ జిల్లా మధపూర్ జాంబూర్‌లో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
హిమాచల్‌తోనే ప్రకటించలేదేం : కాంగ్రెస్
హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌లలో ఎన్నికలు వేర్వేరు తేదీల్లో ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఎట్టకేలకు గుజరాత్ ఎన్నికలను ప్రకటించినందుకు ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు అంటూ కాంగ్రెస్ గుజరాత్ ఇంచార్జి రఘు శర్మ ఎద్దేవా చేశారు. ప్రజాధనంతో ప్రధాని పర్యటల కోసమే బీజేపీకి సమ యం ఇచ్చారని ఈసీపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది.
32 ఏళ్ల తర్వాత త్రిముఖ పోటీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 32 ఏళ్ల తర్వాత త్రిముఖ పోటీ జరుగనుంది. 1990లో కాంగ్రెస్, జనతాదళ్, బీజేపీ వేర్వేరుగా పోటీచేశాయి. జనతాదళ్ (70), బీజేపీ (67) కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. కాంగ్రెస్ 33 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత జనతాదళ్ రాజకీయంగా తెరమరుగైంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ముఖాముఖీ పోరు కొనసాగింది. ఇప్పుడు ఢిల్లీ, పంజాబ్‌లలో గద్దెనెక్కిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుజరాత్‌పై కన్నేసింది. దీంతో గోవాలో మాదిరిగా ఓట్లను చీల్చేసి తన విజయావకాశాలకు ఆప్ గండి కొడుతుందేమోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది.
Updated Date - 2022-11-04T05:43:56+05:30 IST