మాఫియా వరుస ఘాతుకాలు: 24 గంటల్లో ముగ్గురు పోలీసుల హత్య

ABN , First Publish Date - 2022-07-21T01:15:24+05:30 IST

గాంధీనగర్: దేశ వ్యాప్తంగా మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలో ముగ్గురు పోలీసులను పొట్టన పెట్టుకున్నారు.

మాఫియా వరుస ఘాతుకాలు: 24 గంటల్లో ముగ్గురు పోలీసుల హత్య

గాంధీనగర్: దేశ వ్యాప్తంగా మాఫియా (mafia) ముఠాలు రెచ్చిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలో ముగ్గురు పోలీసులను పొట్టన పెట్టుకున్నారు. మృతుల్లో ఓ డీఎస్పీ, మహిళా ఎస్‌ఐ, ఓ కానిస్టేబుల్ ఉన్నారు. తాజాగా గుజరాత్ ఆనంద్ ప్రాంతంలోని బోర్సాడ్ పట్టణం చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కానిస్టేబుల్ రాజ్‌కిరణ్‌ను హతమార్చారు. తనిఖీ కోసం వాహనం ఆపమన్నా మరింత వేగం పెంచి అదే వాహనంతో ఢీ కొట్టించారు. తీవ్ర గాయాలపాలైన రాజ్‌కిరణ్‌ను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశారు. మరో కానిస్టేబుల్ చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈ వాహనంలో కంపెనీల్లో వాడే రసాయన పౌడర్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఫార్మా మాఫియా ఈ పౌడర్‌ను అనుమతుల్లేకుండా తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలింపు జరుపుతున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.  


నిన్న ఉదయం డీఎస్పీ సురేందర్ బిష్ణోయ్‌ను మైనింగ్ మాఫియా అతి దారుణంగా హతమార్చింది. హర్యానాలోని నుహ్‌లో చట్టవిరుద్ధ గనుల తవ్వకాలను ఆపేందుకు ప్రయత్నించిన డీఎస్‌పీ ర్యాంకు అధికారి సురేందర్‌పై నుంచి వాహనాన్ని నడిపి హత్య చేశారు. నుహ్ గ్రామంలోని పచగామ్ వద్ద అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లారు. ఒక వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా ట్రక్కు డ్రైవర్ ఆపకుండా ఆయన పైనుంచి దూసుకుపోయాడు. దాంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.


ఈ ఉదయం జార్ఖండ్‌లోని రాంచీలో మహిళా ఎస్‌ఐ సంధ్యను ఆవుల అక్రమ రవాణా మాఫియా సభ్యులు కిరాతకంగా చంపేశారు. ఆవుల అక్రమ రవాణాను ఆపేందుకు ప్రయత్నించిన మహిళా సబ్ఇన్‌స్పెక్టర్ సంధ్య టోప్నోపై నుంచి వాహనాన్ని నడిపి హత్య చేశారు. రాంచీలోని టుపుడన ఔట్‌పోస్ట్ ఇన్‌ఛార్జిగా సంధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒడిశా నుంచి ఓ లారీలో ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సంధ్య ఆ లారీని ఆపాలని సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆ లారీని ఆపకుండా ఆమె పై నుంచి దూసుకెళ్ళేలా దాని డ్రైవర్ నడిపించాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. దానిని గమనించిన మిగిలిన పోలీసులు ఆ లారీని వెంబడించారు. వేగంగా వెళ్తున్న ఆ లారీ ప్రమాదానికి గురై, బోల్తా పడింది. దానిని నడుపుతున్న నిసార్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరొక వ్యక్తి తప్పించుకున్నాడు. దర్యాప్తు కొనసాగుతోంది. 

Updated Date - 2022-07-21T01:15:24+05:30 IST